telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా కుమారుడు కరోనా నుంచి కోలుకున్నాడు… దర్శకుడి పోస్ట్

Padmakumar

తన కుమారుడు ఆకాశ్‌ కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) బారి నుంచి కోలుకున్నాడని సినీ దర్శకుడు పద్మకుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆకాశ్‌కు చికిత్స అందించిన వైద్యులు, నర్సులు.. అదే విధంగా కేరళ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘‘కరోనా బారిన నా కుమారుడు ఆకాశ్‌, తన స్నేహితుడు ఎల్దో మాథ్యూ కోలుకున్నారు. కరోనాపై పోరులో అంకితభావం ప్రదర్శిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు. వీరందరి కెప్టెన్‌, గౌరవనీయ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఆరోగ్య శాఖా మంత్రి శైలజా టీచర్‌… జిల్లా కలెక్టర్‌ సుహాస్‌కు కృతజ్ఞతలు’’అని ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. కరోనా కాలంలో అందరూ ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా మలయాళ అగ్రహీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో పద్మకుమార్‌ తెరకెక్కించిన “మామాంగం” సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా పద్మకుమార్‌ కుమారుడు ఆకాశ్‌ పారిస్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ స్నేహితుడు ఎల్దో మాథ్యూతో కలిసి మార్చి 15న కేరళకు తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో వాళ్లిద్దరిని క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు. అయితే కరోనా లక్షణాలు బయటపడటంతో కలామాసెరీ మెడికల్‌ కాలేజీలో ఆకాశ్‌, మాథ్యూకు చికిత్స అందించారు. ఇక ఇటీవల మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. దీంతో వారిని బుధవారం డిశ్చార్జి చేశారు. ఈ విషయాన్ని పద్మకుమార్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించారు.

Related posts