telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ : దిల్లీ క్యాపిటల్స్‌ విజయం ..

delhi won on rajastan ipl 2019 match

నేడు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లోను దిల్లీ క్యాపిటల్స్‌ రాజస్థాన్‌ పై విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో తొమ్మిది విజయాలు సాధించి ఆ జట్టు ఘనంగా ప్లే ఆఫ్‌కు చేరింది. రాజస్థాన్‌ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని దిల్లీ ఐదు వికెట్లు కోల్పోయి 16.1 ఓవర్లలో పూర్తిచేసింది. ఓపెనర్లు పృథ్వీషా(8), శిఖర్‌ధావన్‌(16) నాలుగో ఓవర్‌లో వరుస బంతుల్లో ఔటవ్వగా తర్వాత వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌(15), రిషభ్‌ పంత్‌(53; 38 బంతుల్లో 2×4, 5×6) నిదానంగా ఆడి స్కోర్‌బోర్డుని ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో శ్రేయస్‌ అయ్యర్‌ ఔటైనా పంత్‌ క్రీజులో నిలదొక్కుకున్నాడు. తర్వాత వచ్చిన కొలిన్‌ ఇంగ్రామ్‌(12), రూథర్‌ఫోర్డ్‌(11)తో కలిసి పంత్‌ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో అర్ధశతకం సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా రాజస్థాన్‌ బౌలర్లలో ఇష్‌ సోధి మూడు వికెట్లు తీయగా శ్రేయస్‌ గోపాల్‌ రెండు వికెట్లు తీశాడు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్‌ (50; 49 బంతుల్లో 4×4,2×6)అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేశాడు. మొదటి నుంచీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు ఏ దశలోనూ భారీ స్కోర్‌ చేసేలా కనిపించలేదు. లివింగ్‌స్టన్‌(14), శ్రేయస్‌గోపాల్‌(12) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ రెండంకెల స్కోర్‌ సాధించలేదు. ఆఖరి ఓవర్‌లో పరాగ్‌ రెండు సిక్సులు బాది అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి భారీ షాట్‌ ఆడబోయి రూథర్‌ఫోర్డ్‌ చేతికి చిక్కాడు. దీంతో రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌కి తెరపడింది. దిల్లీ బౌలర్లలో ఇషాంత్‌శర్మ, అమిత్‌ మిశ్రా మూడేసి వికెట్లు తీయగా ట్రెంట్‌ బౌల్ట్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

Related posts