telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

దిల్లీ దీక్ష .. జరిగింది 12 గంటలకు.. ఖర్చు 11 కోట్లపైనే..నిజం ఇదే.. !!

chandrababu delhi diksha today
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం దిల్లీలో ధర్మపోరాట దీక్ష చేశారు. ఫిబ్రవరి 11న ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష రాత్రి 8 గంటలకు ముగిసింది. ఈ 12 గంటల దీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11.12 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇది ప్రభుత్వ కార్యక్రమం అని టీడీపీ చెబుతోంటే, ఇది రాజకీయ కార్యక్రమం అని, ఇలాంటి కార్యక్రమానికి 11 కోట్ల ప్రజాధనాన్ని కేటాయించడం ఏమిటని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
నిజంగానే ఏపీ ప్రభుత్వం ఒక్కరోజు దీక్షకు 11.12 కోట్ల రూపాయలను కేటాయించిందా? ఇందులో నిజానిజాలేంటి? దిల్లీలో ఫిబ్రవరి 11న జరిగిన దీక్ష ఖర్చుల కోసం 10 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఫిబ్రవరి 6న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ జీఓ నెంబర్ 215ను విడుదల చేసింది. సాధారణ పరిపాలన విభాగం నుంచి వచ్చిన ఫైలు ఆధారంగా, అందులో పేర్కొన్న మేరకు ఈ మొత్తాన్నివిడుదల చేస్తున్నామని వివరించింది.
సాధారణ పరిపాలన (ప్రొటోకాల్) విభాగం అదే రోజు జీఓ 262ను విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఒకరోజు దీక్షకు గాను ఆసక్తికలిగిన రాజకీయ పార్టీలు, సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతరులను తీసుకెళ్లేందుకు గాను అనంతపురం, శ్రీకాకుళంల నుంచి 20 బోగీలు ఉన్న రెండు ప్రత్యేక రైళ్ల సేవలను ఉపయోగించుకునేందుకు రూ.1,12,16,465 కేటాయిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఈ జీవోలు సోషల్ మీడియా ద్వారా చాలామందికి చేరాయి. దిల్లీ దీక్ష కోసం ఇంత ఖర్చా? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
ఈ విమర్శలపై బాబు స్పందిస్తూ, దిల్లీ వెళ్లడానికి రైళ్ల కోసం 1.23కోట్లు, దీక్ష కోసం 1.60కోట్లు ఖర్చు పెట్టాము. మొత్తం 2.83కోట్లు ఖర్చు మాత్రమే అయిందని వివరించారు.  ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం జీవో ద్వారా నగదు విడుదల చేయడం సహజం, కానీ అది అంతా ఖర్చు అయిందని అనుకోటానికి వీల్లేదు. దానిలో ముందుగా చెప్పినట్టుగా, 2.83 కోట్లు మాత్రం ఖర్చయినట్టు తెలిపారు. అయినా ఇలాంటి కార్యక్రమాలకు ప్రజాధనం ఎలా వాడుతారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Related posts