ఢిల్లీకి కూడా వరద ముప్పు ఏర్పడింది. ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తుండడంతో యమునా నది వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. దాంతో ఢిల్లీ నగరాన్ని యమున నీళ్లు చుట్టుముట్టే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఎగువన ఉన్న హత్నీకుండ్ ప్రాజక్టు నుంచి 8 లక్షల క్యూసెక్కుల మేర భారీగా వరద నీటిని విడుదల చేశారు.
వరద పరివాహక ప్రాంతాలలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు. ఓల్డ్ లోహా బ్రిడ్జ్ ను మూసివేశారు. ఓల్డ్ లోహా బ్రిడ్జ్ వద్ద నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో 205.94 మీటర్లకు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సీఎం కేజ్రీవాల్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.