నిన్నటి మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఓటమి చాలా నిరాశపరిచింది. దీనిని ఏం చెప్పాలో తెలియడం లేదు. ఈ ఓటమిని ఎలా తీసుకోవాలో అంతకన్నా అర్థం కావడం లేదు. నేను, బెయిర్‌స్టో ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని సెట్ చేశాం. కానీ దాన్ని కడవరకూ కొనసాగించలేకపోయాం. చివర్లో బ్యాటింగ్ సరిగా లేకపోతే గెలవలేం. అదే పదే పదే రుజువువతోంది. జట్టుకు మిడిల్ ఆర్డర్ సమస్య ఎప్పటినుంచో ఉంది. సరైన ఆటగాడు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన సమయం వచ్చింది’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ‘నేను చివరి వరకు క్రీజ్‌లో ఉండాలనే అనుకున్నా. అది నా గేమ్ ప్లాన్. కానీ హార్దిక్ పాండ్యా అద్భుతమైన త్రో కారణంగా రనౌట్ అయ్యా. మనం చేజింగ్ చేసే క్రమంలో మిడిల్ ఆర్డర్లో స్మార్ట్ క్రికెట్ ఆడాలి. ఈ స్లో వికెట్‌పై మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. గత వికెట్ కంటే ఈ వికెట్ బాగుంది. తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. చివర వరకూ బ్యాటింగ్ కొనసాగించే విధంగా ఉండాలి. విలియమ్సన్ గాయం గురించి ఫిజియోస్తో మాట్లాడాలి. అతడు జట్టులో పెద్ద పాత్ర పోషిస్తాడు’ అని వార్నర్ చెప్పుకొచ్చాడు.