telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్

కుమార్తెలే .. తండ్రికి తలకొరివి.. రుణం తీర్చుకోగలిగాం..

daughters completed fathers last journey

తండ్రి మరణించడంతో పుట్టెడు దుఃఖంలో స్వదేశానికి వచ్చి, సోదరులు లేకపోవటంతో తానే తలకొరివి పెట్టింది ఒక కుమార్తె. వృత్తి రీత్యా వైద్యురాలుగా విదేశాలలో పనిచేస్తున్న ఆమె తండ్రి మృతి విషయం తెలియగానే స్వదేశానికి విచ్చేసి, జరగాల్సిన కార్యక్రమాలు స్వయంగా చేసి, తండ్రి రుణం తీర్చుకుంది. వివరాలలోకి వెళితే.. దేవరాపల్లి మండలంలోని కేఎం.పాలెంలో తండ్రికి తలకొరివి పెట్టి కుమార్తెలు రుణం తీర్చుకున్నారు. గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బాదిరెడ్డి దేముడుబాబు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతిచెందారు. ఈయనకు భార్య కుమారి (తాజా ఉపసర్పంచ్‌), కుమార్తెలు చైతన్యకృష్ణ, సుజాత ఉన్నారు. కుమారుడు నరేంద్ర మృతి చెందాడు. దేముడుబాబు పెద్దకుమార్తె చైతన్యకృష్ణ అమెరికాలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. రెండో కుమార్తె సుజాత స్థానికంగా ఉంటుంది.

వైద్యురాలు చైతన్యకృష్ణ తండ్రి మరణవార్త తెలియగానే అమెరికా నుంచి వచ్చారు. కుమారుడు లేకపోవడంతో తండ్రి దహన సంస్కారాలను కుమార్తెలు నిర్వహించారు. కుటుంబసభ్యులతో కలిసి తండ్రి దహన సంస్కరణల్లో పాల్గొన్నారు. చిన్నకుమార్తె సుజాత తండ్రి పాడి మోయగా, పెద్దకుమార్తె, ప్రవాస వైద్యురాలు చైతన్యకృష్ణ తండ్రికి తలకొరివి పెట్టారు. ఈ ఘటన చూసిన స్థానికుల హృదయాలు చలించాయి. తండ్రి రుణాన్ని ఈ విధంగా తీర్చుకోగలిగానని చైతన్యకృష్ణ అన్నారు.

Related posts