telugu navyamedia
వార్తలు

కరోనాతో మృతి చెందిన మహనీయులకు నృత్య నీరాజనం..

కళ పత్రిక, కథక్ కళాక్షేత్ర తో కలసి కరోనా లో మృతిచెందిన మహానుభావులకు గొప్ప నృత్య నివాళి కార్యక్రమం నిర్వహించింది. కోవిద సహృదయ ఫౌండేషన్ డాక్టర్ జి.అనూహ్య రెడ్డి గారి సౌజన్యం తో పితృ అమావాస్య నాడు త్యాగరాయ గానసభ ఇందుకు వేదిక అయ్యింది!


గత ఏడాదిన్నర కాలం చీకటి దుర్దినాలు అని చెప్పుకోవాల్సిందే! ఎంతో మంది సాహితీవేత్తలు, కళాకారులు, సాంస్కృతిక సంస్థల నిర్వాహకులు, పాత్రికేయులను కోల్పోయాం! మామూలు రోజుల్లో అయితే, ప్రముఖులు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారు కనుమూస్తే …వారి భౌతిక కాయం సందర్శించి నివాళులు అర్పించడం, అనంతరం సంతాప సభ ఏర్పాటు చేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగేది! కరోనా సమయం లో ఇలాంటివేమీ జరిగే పరిస్థితి లేదు! కనీసం చివరి చూపు కూడా దక్కని దుస్థితి!


పితృ అమావాస్య రోజున పెద్దలను స్మరించుకోవడం ఒక గొప్ప సంప్రదాయం! ఆ సందర్భం పురస్కరించుకుని ప్రత్యేకంగా నృత్య నివాళి ఏర్పాటు చేశాం! ఇందుకు ప్రముఖ నాట్య గురు పండిట్ అంజుబాబు గారు ఎంతో సహకరించారు! డాక్టర్ జి.అనూహ్య రెడ్డి గారు అండగా నిలిచారు! వారిద్దరికీ ధన్యవాదాలు!

ఐదారు దశాబ్దాలుగా ఆయా రంగాల్లో విశేష కృషి చేసి విశిష్ట స్థానం సంపాదించుకుని, కరోనా కష్ట కాలం లో ఈ లోకాన్ని వీడిన మహనుభావులలో 50 మందిని గుర్తించి వారందరికీ నృత్య నివాళి సమర్పించి ఘన శ్రద్ధాంజలి ఘటించాం! ఇందులో పద్మ విభూషణ్ డాక్టర్ ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, పద్మభూషణ్ పండిట్ జస్ రాజ్, పద్మశ్రీ కె.శోభానాయుడు ఉన్నారు! వంగపండు ప్రసాదరావు, కాళీపట్నం రామారావు, సి.ఎస్.రావు, సి.ఆనందారామం, పోరంకి దక్షిణామూర్తి, దేవిప్రియ, వెన్నెలకంటి రాజేశ్వరరావు, బ్రహ్మకుమారి హృదయ మోహిని, అయ్యదేవర పురుషోత్తమరావు, పట్రాయని సంగీతరావు, కామినేని శ్రీనివాసులు, రావి కొండలరావు, జి.ఆనంద్, సురభి జమునా రాయలు, చంద్ర, చింతా ఆదినారాయణ శర్మ, పసుమర్తి కేశవ ప్రసాద్, ఎస్.వి.ప్రసాద్ IAS, ఎ.ఎస్.ఆర్.మూర్తి, ఏడిద గోపాలరావు, విజయ ప్రకాష్, జయప్రకాశ్ రెడ్డి, జీడిగుంట రామచంద్రమూర్తి, నుసుము కోటి శివ, ఖాన్ అథర్, బాలాంత్రపు హేమచంద్ర, హాసం రాజా, అండా రామారావు, జి.ఎల్.ఎన్.మూర్తి, వై.కె.నాగేశ్వరరావు, ఎన్.వి.ఎల్.నాగరాజు, పి.రమేష్ బాబు, టి.ఎన్.ఆర్., శ్రీగిరిరాజు విజయలక్ష్మి, స్వాతి మణిచందన, కొత్తపల్లి పద్మ, ఎం.సాంబశివరావు, పి.కొండబాబు, ముసునూరి ఇందిర, ఎన్.దుర్గాప్రసాద్, మిమిక్రి నాగభూషణం, జలదంకి ప్రభాకర్, మేలత్తూర్ నటరాజన్, సునీల్ కొఠారి, కె.వెంకట్రావు, మాజీ మంత్రివర్యులు ఎం.సత్యనారాయణరావు తదితరులకు నివాళులు అర్పించాం!
ఈ సభ లో తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి, సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం, డాక్టర్ జి.అనూహ్య రెడ్డి, శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ, డాక్టర్ ఎం.కె.రాము, డాక్టర్ వనజా ఉదయ్ పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు!


డాక్టర్ వెంకట్ అర్ధనారీశ్వర ప్రదర్శించగా, కూచిపూడి నాట్యం తో ప్రముఖ నర్తకి రోహిణి కందాళ, భరత నాట్యం తో డాక్టర్ గౌతమి, కథక్ తో ఇషిత నృత్య నీరాజనం సమర్పించారు. శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ ప్రత్యేకంగా పద్యం తో నివాళులు అర్పించిన తీరు ఆకట్టుకుంది. పండిట్ అంజుబాబు, డాక్టర్ మహ్మద్ రఫీ పర్యవేక్షించారు.

Related posts