ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరూన్ బ్యాన్‌క్రాఫ్ట్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన విషయం.. ఇతర బౌలర్లకూ తెలుసని బాన్‌క్రాఫ్ట్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దాంతో ఈ సాండ్ పేపర్ గేట్ వివాదంలో బాన్ క్రాఫ్ట్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నరే కాకుండా ఇతరుల పాత్ర కూడా ఉందా? అనే అనుమానాలు రేకెత్తాయి. అయితే బాన్‌క్రాఫ్ట్ చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. ఇంకా ఈ వ్యవహారంలో ఎవరికైనా సమాచారం తెలిసి ఉంటే స్వయంగా ముందుకు రావాలని ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించి దర్యాప్తు గతంలోనే సమగ్రంగా జరిగిందని, అవసరమైతే మరోసారి దర్యాప్తు చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని సీఏకు చెందిన ఓ అధికారి తెలిపారు. ‘2018లో ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా మధ్య జరిగిన కేప్‌టౌన్ టెస్టులో.. బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఎవరి వద్ద అయినా కొత్త సమాచారం ఉంటే వెల్లడించాలి. ఇందుకు సంబంధించిన దర్యాప్తు గతంలోనే జరిగింది. అప్పటి నుంచి దీని గురించి ఎవరూ చర్చించలేదు. అయితే మా దర్యాప్తులో ఏమైనా సందేహాలు ఉంటే చెప్పొచ్చు. దోషులుగా తేలితే మిగతావారిని కూడా శిక్షిస్తాం’అని క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు.