ప్రముఖ నటుడు, టీడీపీ సీనియర్ నేత, మురళీమోహన్ నంది అవార్డులపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త టి.సుబ్బరామిరెడ్డి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో జయసుధతో కలిసి మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు అవార్డులు పండుగ అంటూ ఉండేదని అన్నారు. ఇప్పుడా అవార్డుల గురించి మాట్లాడేవాళ్లే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ నంది అవార్డులను విస్మరించాయని అన్నారు.
నంది అవార్డులు ఎంతో ప్రతిష్ఠాత్మకమైనవని, ప్రభుత్వం ఇచ్చే అవార్డులంటే గొప్పగా చెప్పుకుంటారని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. అయితే కొంతకాలంగా ఈ అవార్డులను పట్టించుకోవడం మానేశారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అవార్డులను ప్రదానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.