telugu navyamedia
క్రీడలు వార్తలు

టెస్ట్ జెర్సీని అందుకున్న భారత మహిళల జట్టు…

జూన్‌లో ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్న మిథాలీ రాజ్ జట్టు.. ఇంగ్లీష్ టీమ్‌తో ఓ టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు, టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. ఒకవంక కోహ్లీసేన.. మరో వంక విమెన్స్ టీమ్ ఒకేసారి ఇంగ్లాండ్‌లో పర్యటించబోతోండటం ఆసక్తి రేపుతోంది. ఎవరి సత్తా ఎలాంటిదో నిర్ధారించే టూర్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు క్రికెట్ ప్రేమికులు. ఆ ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు సంబంధించిన కొత్త జెర్సీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు విడుదల చేసింది. కేప్టెన్ మిథాలి రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, ఝులన్ గోస్వామి, స్మృతి మంధాన దీన్ని ఆవిష్కరించారు. భారత మహిళా క్రికెట్ జట్టు ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంటోంది. జూన్ తొలివారంలో ఇంగ్లాండ్‌ విమానం ఎక్కుతుంది. బ్రిటన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. మరో మూడు రోజుల పాటు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది. ఆ తరువాతే ఫీల్డ్ లోకి అడుగు పెడుతుందా జట్టు. ఇంగ్లాండ్‌తో మిథాలీరాజ్ టీమ్.. ఆడబోయే తొలిటెస్ట్ మ్యాచ్ జూన్ 16వ తేదీన ఆరంభమౌతుంది. బ్రిస్టల్ స్టేడియం దీనికి వేదికగా మారింది. ఏడేళ్ల తరువాత విమెన్స్ టీమ్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతోండటం ఇదే తొలిసారి. ఆ తరువాత మూడు వన్డే ఇంటర్నేషనల్స్, మూడు టీ20 మ్యాచ్‌లు ఆరంభమౌతాయి. బ్రిస్టల్, టౌంటన్, వర్సెస్టర్, నార్థాంప్టన్, బ్రైటన్, ఛెమ్స్‌ఫోర్డ్‌లల్లో ఈ మ్యాచ్‌లు సాగుతాయి. టెస్ట్ ఫార్మట్‌కు మిథాలి రాజ్ సారథ్యాన్ని వహిస్తారు. వన్డే, టీ20 ఫార్మట్లకు హర్మన్ ప్రీత్ కౌర్ కేప్టెన్‌గా వ్యవహరిస్తారు.

Related posts