telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఇరు రాష్ట్రాల గవర్నర్లపై సీపీఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇరు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీలో గవర్నర్ ప్రసంగాన్ని ప్రతిపక్ష టిడిపి నాయకులు బహిష్కరించడం… తెలంగాణలో అసలు గవర్నర్ ప్రసంగమే లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవడం రాజకీయ దుమారం రేపాయి.

ఈ క్రమంలోనే సిపిఐ నాయకులు నారాయణ గవర్నర్ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. అనుభవంతో కూడిన వ్యక్తులు గవర్నర్‌గా వస్తే ఆ పదవికి గౌరవం చేకూరుతుందని నారాయణ పేర్కొన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగాన్ని శాసనసభ సమావేశంలో బహిష్కరించిందని పేర్కొన్నారు.

ఏపీ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ ముఖ్యమంత్రి జగన్ కి హెడ్ క్లర్క్ గా మారారని… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారని నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

ఎలక్షన్ కమిషన్ విషయంలో చర్యలు తీసుకునే అధికారం పార్లమెంట్‌కు తప్ప ఎవరికీ లేదని అన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న బాల్యచాపల్య చర్యలను అనుభవంతో కూడిన గవర్నర్ సరి చేయాల్సింది పోయి వాటినే సమర్ధిస్తున్నారని నారాయణ ఆరోపించారు.

రాష్ట్రాల గవర్నర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బ్రోకర్ గా మారారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు . వీరి వల్ల వందల కోట్ల ఖర్చు తప్ప ఉపయోగం లేదని.. అసలు ఈ వ్యవస్థే వేస్ట్ అని నారాయ‌ణ‌ కామెంట్ చేశారు.

కేంద్రానికి అనుకూలంగా ఉండేవారిని బాగానే చూసుకుంటున్న గవర్నర్లు.. వ్యతిరేకిస్తున్నవారిని మాత్రం ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇందుకు పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలో ఉదాహరన అని నారాయణ అభిప్రాయపడ్డారు.

Related posts