telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్రజలిచ్చిన శక్తితోనే నేనిలా నిలబడ్డా- సీఎం కేసీఆర్

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌, నీటి సమస్యలు తీరిపోయాయని తెలిపారు.

నారాయణఖేడ్‌ శివారులోని అనురాధ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడుతూ.. 14 ఏళ్లు పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. ప్రజలిచ్చిన శక్తితోనే నేనిలా నిలబడ్డానని చెప్పారు.

అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని కేసీఆర్‌ పేర్కొన్నారు. బంగారు తెలంగాణని తయారు చేసుకున్నట్టే.. బంగారు భారతదేశాన్ని తయారుచేద్దామని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

భారత్‌ను అమెరికా కంటే గొప్పగా తయారుచేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇప్పటివరకు మన విద్యార్థులు అమెరికా వెళ్లేవారని… విదేశీ విద్యార్థులే భారత్‌కు వచ్చే విధంగా అభివృద్ధి జరగాలన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశాన్ని బాగుచేసుకుందామని సభలో సీఎం స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు అందరి దీవెన కావాలని ఆయన కోరారు.

తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో ఈ ప్రాంతానికి వస్తే పది మంది కార్యకర్తలు ఉండేవారు. ప్రజల్లో కూడా పెద్దగా ఆశ ఉండేది కాదు. కేసీఆర్‌ వస్తుండు.. పోతుండు.. తెలంగాణ వస్తదా.. రాదా.. అని అనేక సందేహాలు ఇక్కడి ప్రజల్లో ఉండేవి. వేరే పార్టీల వారు కూడా ప్రజలను గందరగోళానికి గురి చేసేవారు.

తెలంగాణ వస్తే తప్ప పరిస్థితులు మారవని ఉద్యమం చేశా. ఉద్ధృతంగా ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణ వస్తే పరిశ్రమలు మూతపడతాయని కొంత మంది చెప్పారు. తెలంగాణ నాయకులకు పరిపాలన చేతకాదన్నారు. రాష్ట్రంలో అంధకారం అలుముకుంటుందని అవాస్తవాలు ప్రచారం చేశారు. అప్పడు విమర్శలు చేసిన ఏపీలోనే ఇప్పుడు అంధకారం ఉంది.

తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నామని, రాష్ట్రంలో విద్యుత్‌, నీటి సమస్యలు తీరిపోయాయని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని కేసీఆర్‌ పేర్కొన్నారు. రూ.2,653 కోట్ల అంచనాతో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని, రూ.1,774 కోట్ల అంచనాతో బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు.

Related posts