telugu navyamedia
తెలంగాణ వార్తలు

మునుగోడులో టీఆర్ఎస్‌‌కే సీపీఐ మద్దతు.. -చాడ వెంకట్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న రాజీనామా తో ఉప ఎన్నిక అనివార్యం కావ‌డంతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

మునుగోడులో టీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతుపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అధికారిక ప్రకటన చేశారు. మునుగోడులో టీఆర్ఎస్‌కే తమ పార్టీ మద్దతిస్తోందని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ పార్టీతో తాము కలిసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశం తర్వాత మునుగోడులో టీఆర్ఎస్‌కే తమ పార్టీ మద్దతిస్తోందని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉపఎన్నికల్లో సీపీఐ పోటీ చేసే పరిస్థితి లేదన్నారు.

అందువల్ల బీజేపీని ఓడించే పార్టీకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇది మునుగోడుకే పరిమితం కాదని, భవిష్యత్‌లో కూడా టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

బీజేపీని ఓడించే సత్తా టీఆర్‌ఎస్‌కే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. అందుకే మునుగోడు ఉపఎన్నికలో తాము టీఆర్‌ఎస్‌కు మద్దుతు పలుకుతున్నామని చెప్పారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీ తీర్మానం ఉందన్నారు.

2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తమ పార్టీని ఇబ్బంది పెట్టిందని అన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తమ పార్టీకి ఇచ్చిన మూడు సీట్లలో కూడా పోటీ చేసిందని అన్నారు. అప్పడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇబ్బంది పెట్టారని చెప్పారు. మునుగోడులో నేడు జరిగే టీఆర్ఎస్ సభకు రావాలని కేసీఆర్ తమను ఆహ్వానించారని చెప్పారు. మునుగోడు సభకు సీపీఐ నేతలు వెళ్తున్నారని  తెలిపారు. 

Related posts