telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్రజలు ఉప ఎన్నిక కోరుకోవడం లేదు…రాజగోపాల్‌రెడ్డితో అధిష్టానం మాట్లాడుతోంది.

తెలంగాణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డివ్య‌వ‌హారం చ‌ర్చానీయాంశంగా మారింది.మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమంటూ ఆయన వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది.

ఈ నేపథ్యంలో రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలపై సీఎ‍ల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఈ సంద‌ర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఉప ఎన్నిక కోరుకోవడం లేదని, రాజగోపాల్‌రెడ్డితో అధిష్టానం మాట్లాడుతోంద‌ని అన్నారు . ఆయనకు ఉన్న ఇబ్బంది తెలుసుకొని పరిష్కారం చేస్తామన్నారు. సాధ్యమైనంత వరకు ఆయన పార్టీలోనే ఉండేలా చూస్తామ‌ని అన్నారు.

అదే స‌మ‌యంలో రాష్ట్రంలో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వరద కష్టాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ప్రజల కష్టాలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

తెలంగాణ ఆదాయాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుకు దారాపోశారు. ఇంత వరకు ఒక ఎకరాకు కూడా కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇవ్వలేదు. రాష్ట్రంలో అస‌లు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు ఎవరైనా వెళతాం అంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అక్కడ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి సీఎల్పీ బృందంతో కలిసి కాళేశ్వరం వెళనున్నట్లు తెలిపారు. తమను అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. వరదల వల్ల జరిగిన నష్టంపై చర్చించడానికి వెంటనే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వర్షకాల సమావేశాలు ఇంకా ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. 

Related posts