telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ లో టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసు : నారాయణను కోర్టుకు హాజరుపరచాలన్న మేజిస్ట్రేట్‌

పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఏపీ మాజీ మంత్రి పి. నారాయణను కోర్టులో హాజరు పర్చాలని చిత్తూరులోని నాలుగో అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశించింది. 

మంత్రి నారాయణతో పాటు జామీనుదారులను కోర్టులో హాజరు పర్చాలని కోర్టు ఆదేశాలపై నారాయణ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది.

ఏపీ లో పదవ తరగతికి చెందిన తెలుగు ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి పి. నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టైన నారాయణకు కోర్టు ఈ నెల 11న బెయిల్‌ మంజూరు చేసింది. లక్ష రూపాయాల చొప్పున ఇద్దరు పూచీకత్తులను కోర్టుకు సమర్పించాలని జడ్జి సులోచనారాణి ఆదేశించారు. ఈ నెల 18 లోపుగా పూచీకత్తులను కోర్టుకు సమర్పించాలని కూడా ఆదేశించింది.

దీంతో సోమవారం నాడు మాజీ మంత్రి నారాయణ న్యాయవాదులు చంద్రశేఖరనాయుడు, రామకృష్ణ, జ్యోతిరామ్ లను నాలుగో అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చారు. దీనిపై మేజిస్ట్రేట్‌ శ్రీనివాస్‌ స్పందిస్తూ నిందితుడు రాకుండా ష్యూరిటీలను తీసుకోవడం కుదరదని స్పష్టం చేశారు.

 మాజీ మంత్రి నారాయణను కూడా కోర్టులో హాజరుపర్చాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఈ విషయమై నారాయణ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. దీంతో కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది కోర్టు.

Related posts