telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మ‌ళ్ళీ సీఎంగానే స‌భలో అడుగుపెడ‌తా..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ర‌ణ‌రంగంగా మారింది. ఇవాళ ఉదయం నుంచి అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వ్యవసాయంపై చర్చ వ్యక్తిగత విమర్శలకు దారితీసింది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ జరిగే తీరుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. గౌరవప్రదమైన సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సభలో సీనియర్ పొలిటీషియన్ అనే గౌరవం లేకుండాపోయిందన్నారు.

త‌న‌పైన‌, త‌న కుటుంబంపైనా స‌భ‌లో వైసీపీ నేత‌లు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు చేస్తున్నార‌ని, త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా , పార్టీ ప‌రంగా ఇబ్బంది పెట్టార‌ని, రెండున్న‌రేళ్లుగా ఎన్నోఅవ‌మానాలు భ‌రించాన‌ని, ఏ ప‌రువుకోసం ఇన్నేళ్లు ప‌నిచేశానో .. నా కుటుంబం, నాభ‌ర్య విష‌యం కూడా ఈ హౌస్‌లో తీసుకొచ్చి, రోడ్డుపైకి లాగారని తీవ్ర మ‌న‌స్తాపం చేందారు.

ఎప్పుడూ లేని అవమానాలు భరించాను.. సభలో ఎన్నో చర్చలు చూశాం కానీ.. ఇంత అవమానం ఎప్పుడూ ఎదుర్కోలేదు అని అన్నారు. సభలో లేని వ్యక్తులగురించి మాట్లాడటమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. వ్యక్తిగతంగా విమర్శించినా పట్టించుకోను… మాట్లాడుతుంటే… మైక్ కట్ చేయడమేంటని స్పీకర్ ను నిలదీశారు.

శాసనసభలో గౌరవించకపోగా అవమానపరచడమే లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని గమనించిన చంద్రబాబునాయుడు…. ప్రజాక్షేత్రంలోకెళ్లి…. ఆశీర్వాదంతో మళ్లీ  స‌భ‌లోకి అడుగుపెడితే అది ముఖ్య‌మంత్రిగానే అని చెప్పి స‌భ‌నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చేశారు. ఆయన వెంటే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బయటికొచ్చేశారు.

Related posts