అక్రమ నిర్మాణాల పై ఏపీ సీఎం జగన్ ఉక్కుపాదం మోపారు. ఉండవల్లిలోని ప్రజావేదికను అక్రమంగా నిర్మించారంటూ దాన్ని కూల్చివేయాలంటూ జగన్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆ భవనాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేయడం జరిగింది. కరకట్టపై ఉన్న నిర్మాణాలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. సీఎం ఆదేశాలతో చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటితో సహా కరకట్టపై ఉన్న పలు నిర్మాణాలపై సీఆర్డీఏ నోటీసులు పంపింది.
దీంతో కృష్ణా నదికి, కరకట్టకు మధ్యలో ఉన్న నిర్మాణాలకు సర్వేయర్లతో కొలతలు తీయించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా చంద్రబాబు ఉంటున్న ఇంటికి కూడా కొలతలు తీయించనున్నారు. సర్వేయర్లతో సమావేశమైన అనంతరం ఈ ప్రక్రియ మొదలుకానుంది. కరకట్టపై నిర్మాణాలను ఎంత దూరంలో నిర్మించారు. విస్తీర్ణం ఎంత వరకు ఉంది.. అన్న అంశాలపై త్వరలో సర్వే చేపట్టనున్నారు.

