డెంగ్యూ జ్వరాల పై ప్రజలకు అవగాహన కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేందర్ కుమార్ జోషి సహా మున్సిపల్ శాఖ కార్యదర్శి గురువారం న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఈ క్రమంలో వారి వివరణపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
నివారణ చర్యలు తీసుకుంటున్నట్లయితే జనవరిలో 85గా ఉన్న డెంగీ కేసులు, అక్టోబర్ నాటికి 3,800కి ఎలా పెరిగాయని ప్రశ్నించింది. ఈ క్రమంలో సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. దోమల నివారణకై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ విషయంపై ప్రతి గురువారం కమిటీ కోర్టుకు నివేదిక సమర్పించాలని తెలిపింది.