telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఎంగిలిపూల బతుకమ్మతో … సంబురాలు మొదలు…

today engili batukamma

నేటి ఎంగిలిపూల బతుకమ్మతో తెలంగాణ లో సంబురాలు మొదలు కానున్నాయి. 9 రోజుల పాటు ఊరూవాడా తీరొక్క పూలు… కోటి కాంతుల్ని వెదజల్లనున్నాయి. సాయంత్రం హన్మకొండ వేయిస్తంభాల గుడిలో అధికారికంగా వేడుకలు ప్రారంభం కానున్నాయి. పెత్తర మాసంతో ప్రారంభమై.. దుర్గాష్టమితో ముగిసే నవరాత్రుల పండుగను శనివారం వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రారంభించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. బతుకమ్మ ఆటపాటలకు తెలంగాణ జానపదాలు నిలయాలు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క రూపంలో బతుకమ్మను పేరుస్తారు. తెలంగాణ ప్రాంతానికే విశిష్టతను తెచ్చిన ఈ మహాపర్వం అంటే అశేష జనవాహినికి ఎంతో ఇష్టం. పూలను కొలుస్తూ కీర్తించడాన్ని బతుకమ్మ సంస్కృతి అని అభివర్ణిస్తున్నారు. తంగేడు.. బీర.. గన్నేరు.. నిత్యమల్లె.. బంతి.. చేమంతి లాంటి పూలతో బతుకమ్మలను అందంగా పేర్చుతారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి.. ఆచార వ్యవహారాలతో పాటు జనజీవన విధానాలకు ఈ పండుగ ప్రతిబింబం. సాంస్కృతికంగా బతుకమ్మ పండుగ తెలంగాణకు కుంభమేళా లాంటిది.

ప్రకృతితో మమేకమై ఆటపాటలతో.. ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ నాటికే ప్రకృతి అంతా పూలవనంగా మారుతుంది. ప్రకృతిలో సేకరించిన పూలను ప్రకృతికే సమర్పించడం అనే ఉద్దేశంతో బతుకమ్మలను నీటిలో విడిచపెడతారు. అక్టోబర్ 6న ట్యాంక్‌బండ్‌పై 10 వేలమందితో సద్దుల బతుకమ్మను నిర్వహించనుంది ప్రభుత్వం. బతుకమ్మ పండుగ అంటేనే ఒక సంబురం. ఏ పండుగకు కలవకున్నా… ఈ పండుగకు చిన్ననాటి స్నేహితులంతా కలుస్తారన్న నమ్మకం. అందుకే ఆడపిల్లలు తప్పకుండా పుట్టింటికి వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. తెలంగాణకే పరిమితమైన ఇచ్చిపుచ్చుకునే సంస్కృతికి చిహ్నంగా ఆడబిడ్డలంతా కలిసి ఆడిపాడతారు. నోరు తీపి చేసుకొని పండుగ జరుపుకుంటారు. పరస్పరం మైత్రిభావం చాటే ఆలింగనాలు బతుకమ్మ పండుగలో కనిపిస్తాయి. వాయినాల్లో బెల్లం, సజ్జలు, పప్పు ధాన్యాలు కలిపి ఇచ్చే ప్రసాదం చాలా ప్రత్యేకమైంది.

Related posts