దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు కావడంతో వలస కార్మికులు అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వారు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడంలేదు. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఓ హైవేపై సిమెంట్ మిక్సర్ వాహనాన్ని ఆపిన పోలీసులు ఆ మిక్సర్ ట్యాంకులో చూసి అవాక్కయ్యారు. సిమెంటు, కంకర, ఇసుక, నీళ్లు కలిపి కాంక్రీట్ మిశ్రమాన్ని తయారుచేసే ఆ మిక్సర్ ట్యాంకులో 18 మంది వలస కార్మికులు దర్శనమిచ్చారు.
ఉత్తరప్రదేశ్ లోని లక్నో వెళుతుండగా ఇండోర్, ఉజ్జయిన్ జిల్లాల మధ్య వారిని అడ్డుకున్నారు. వాహనం ఎక్కడికి వెళుతోందని పోలీసులు ప్రశ్నించగా, డ్రైవర్ నీళ్లు నమిలాడు. దాంతో అనుమానం వచ్చి సోదా చేయగా, మిక్సర్ ట్యాంకులో వలస కార్మికులు కనిపించారు. ట్రక్ డ్రైవర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, కార్మికులను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
ఇసుక కొరతను ప్రభుత్వమే సృష్టించింది: కన్నా