ఎందులో అయినా ఒక్కసారి ఓడిపోతేనే చాలా మంది డీలా పడిపోతుంటారు. అలాంటిది వివిధ ఎన్నికల్లో ఏకంగా 178 సార్లు పోటీ చేసి, ప్రతి ఎన్నికలోనూ ఓడిపోయిన ఓ వ్యక్తి… మళ్లీ లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగారు. అతని పేరు కే పద్మరాజన్. తమిళనాడు ధర్మపురి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 179వ సారి ఎన్నికల బరిలో కాలుమోపారు. అంతేకాదు ఏకంగా పట్టాలీ మక్కల్ కచ్చి నాయకుడు అన్బుమణి రాందాస్ పై పోటీ చేస్తున్నారు. పద్మరాజన్ వృత్తి రీత్యా హోమిపతి వైద్యుడైనా, కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే సంపాదిస్తున్నారంటే ఆశ్చర్యం వేయకమానదు.
1988 నుంచి ఇప్పటి వరకు 179వ సారి ఎన్నికల బరిలోకి దిగారు. పంచాయతీ ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు పలు ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. వాజ్ పేయి, జయలలిత, కరుణానిధి, పీవీ నరసింహారావు, ఏకే ఆంటోనీ, ఎస్ఎం కృష్ణ, మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ, కేఆర్ నారాయణన్, స్టాలిన్ తదితరులపై ఆయన పోటీ చేశారు. తమిళనాడుతో పాటు ఏపీ, కేరళ, కర్ణాటక, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా పద్మరాజన్ మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేయడం రాజ్యాంగం తనకు కల్పించిన హక్కు అని చెప్పారు. ఒకవేళ తాను గెలిస్తే తనకు గుండెపోటు వస్తుందని చమత్కరించారు.
పద్మరాజన్ 2016 వరకు వివిధ ఎన్నికల్లో రూ. 20 లక్షల డిపాజిట్లు కోల్పోయానని చెప్పారు. 200 సార్లు పోటీ చేయాలనేది తన లక్ష్యమని… కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై కూడా పోటీ చేస్తానని తెలిపారు.