రాష్ట్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై ఆసక్తికరంగా చర్చలు సాగుతున్నాయి. సంక్రాంతి తర్వాత ఆయన కొత్త పార్టీ ప్రకటిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. వచ్చే ఎన్నికల్లో రజనీకాంత్ తమతో కలసి రావాలని భాజపా నేతలు కోరుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా గత నెలలో ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పాల్గొన్న కార్యక్రమంలో రజనీకాంత్ ప్రత్యక్షమవడం, కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించడం వంటి విషయాలతో రజనీ భాజపాకు దగ్గరవుతున్నారన్న సంకేతాలు వచ్చాయి.
ఈ విషయంలో రజనీకాంత్ ఇప్పటివరకు తన వైఖరిని స్పష్టం చేయలేదు. నటుడు శివాజీగణేశన్ 92వ జయంతి సందర్భంగా చెన్నై అడయారులోని శివాజీ గణేశన్ మెమోరియల్ వద్ద ఆయన విగ్రహానికి ప్రముఖ తమిళ నటుడు, భాజపా నేత ఎస్వీ శేఖర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రధాని మోదీ వ్యతిరేకులంతా ఏకమయ్యారని, అలాంటప్పుడు భావ సారూప్యత కలిగిన రజనీకాంత్ తమ పార్టీతో చేతులు కలిపితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.

