telugu navyamedia
రాజకీయ

పెళ్లి కుదిరింది.. తంతే మిగిలింది అంటున్న .. బీజేపీ-అన్నాడీఎంకే

bjp alliances with annadmk with 10 seats
తమిళనాట బీజేపీ జండా ఎగరవేయాలనే ఆశ నెరవేరుతున్నట్టుగానే ఉంది. తాజాగా, రాష్ట్ర మంత్రులు తంగమణి, వేలుమణితో బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ చర్చలు జరపడంతో ఇరు పార్టీల మధ్య పొత్తుపై ఓ అవగాహన కుదిరినట్టేనని భావిస్తున్నారు. సీట్ల పంపిణీయే ఇక మిగిలింది. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది.
ఇటీవలే ప్రధాని మోదీ, పార్టీ చీఫ్‌ అమిత్‌షా ఈరోడ్ లో పర్యటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన పీయూష్‌గోయల్‌ పొత్తుపై చర్చించేందుకు రాష్ట్రానికి వచ్చినట్టు విమానాశ్రయంలోనే స్పష్టం చేయడంతో తెర తొలగిపోయింది. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని, అన్నాడీఎంకేతో కూటమి ఏర్పాటుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. 
కేంద్రమంత్రి రాధాకృష్ణన్‌, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్‌లు కూడా సమావేశానికి హాజరు కావడం, అర్ధరాత్రి దాటేవరకు చర్చలు జరిగాయి. 
ఈ చర్చలలో బీజేపీకి కేటాయించే సీట్ల అంశం చర్చకు వచ్చిందని, దానిపై స్పష్టత వచ్చేవరకు ప్రకటన వెలువడే అవకాశం లేదని భావిస్తున్నారు. బీజేపీ 12 ఎంపీ స్థానాలను డిమాండ్‌ చేసిందని, దీనికి అన్నాడీఎంకే ససేమిరా అనడంతో కనీసం 10 స్థానాలైనా ఇవ్వాలని పట్టుబడుతోందని సమాచారం. ముఖ్యంగా దక్షిణ చెన్నై, శ్రీపెరుంబుదూర్‌, వేలూరు, తిరుప్పూర్‌, కోయంబత్తూరు, కన్యాకుమారి, తంజావూరు, శివగంగై, తిరునెల్వేలి, మధురై నియోజకవర్గాల కోసం బీజేపీ పట్టుబడుతోందని.  కానీ మధురై, తిరునెల్వేలి, దక్షిణ చెన్నై, తంజావూరు నియోజకవర్గాలను ఇతర పార్టీలకు కేటాయించాలని ఇప్పటికే నిర్ణయించినందున సాధ్యంకాదని అన్నాడీఎంకే వివరించిందని సమాచారం. అర్ధరాత్రి దాటినా ఈ అంశంపై స్పష్టత రాకపోవడంతో రెండో విడత చర్చలు జరపాలని ఇరు పార్టీలు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Related posts