telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

Pspk

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఈరోజు మెగా అభిమానులకు పండగే అని చెప్పాలి. పవన్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు ప్రముఖులు, అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా పవన్ గురించి ఇప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. కొణిదెల వెంకటరావు, అంజనాదేవి 1971 సెప్టెంబరు 2న బాపట్లలో జన్మించాడు పవన్. ఆయనకు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు. మెగాస్టార్ చిరంజీవి (కొణిదెల శివశంకర వరప్రసాద్) పవన్‌కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత అయిన కొణిదెల నాగబాబు పవన్‌కు రెండవ అన్నయ్య. ఇంటర్ మీడియట్ నెల్లూరులోని కళాశాలలో పూర్తి చేసాడు. అటు పిమ్మట కంప్యూటర్స్ లో డిప్లోమా చేశాడు.

మే 1997లో నందీనితో పవన్ కు వివాహం జరిగింది. 2008 ఆగస్టు 12లో విశాఖపట్నం లోని ఫ్యామిలీ కోర్టు వీరిద్దరకి విడాకులు మంజూరు చేసింది. నటిగా మారిన మోడల్ రేణూ దేశాయ్ ని 2009 జనవరి 28 న వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు అకీరా నందన్, కూతురు ఆద్య ఉన్నారు. తరువాత వీరిద్దరూ విడిపోయారు. తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని, భార్యా భర్తలుగా విడిపోయినా, తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని రేణుక ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది.

ఇక 2013 సెప్టెంబరు 30న ఇతని వివాహం రష్యా అమ్మాయి అన్నా లెజ్‌నోవాతో జరిగింది. హైదరాబాదు లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. వీరిద్దరికి ఒక కూతురు పొలేనా అంజనా పవనోవా, కుమారుని పేరు మార్క్ శంకర్ పవనోవిచ్.

పవన్ తన అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తరువాత “తొలిప్రేమ” చిత్రంతో యూత్ ను తనవైపుకు తిప్పుకున్నాడు. తమ్ముడు, బద్రి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తరువాత “ఖుషి” చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు పవన్. తరువాత వరుసగా జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం, జల్సా, కొమరం పులి, తీన్మార్, పంజా లాంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించారు. అయితే ఇందులో కొన్ని చిత్రాలు పరాజయం పాలైనా పవన్ కు ఏమాత్రం తగ్గలేదు.

“గబ్బర్ సింగ్”తో బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా ఏమిటో నిరూపించాడు పవన్. ఈ చిత్రానికి గానూ పవన్ ఉత్తమ నటునిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకొన్నాడు. ఇక “అత్తారింటికి దారేది” చిత్రం వసూళ్ళలో అప్పటి వరకు తెలుగు సినీపరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిందని అంటారు. 2015 లో గోపాల గోపాల చిత్రంలో మోడరన్ కృష్ణునిగా నటించాడు. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లతో సినిమాలు నిర్మించాడు. 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2016 ప్రారంభంలో కాటమరాయుడు సినిమాలలో నటించాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 25వ చిత్రం అజ్ఞతవాసిలో నటించాడు. ఈ చిత్రం పవన్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.

2009లో అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేశాడు. జనసేనపార్టీతో మరోసారి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కల్యాణ్ 2014 సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతు పలికాడు. 2014 మార్చి 14 న “జనసేన” రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ జరిపాడు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తెలిపాడు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోడీకి మద్దతుగా టీడీపీ-బీజేపీ కూటమికి ప్రచారం చేశాడు. ఇతని ప్రచారంతోనే టి.డి.పి ఏపీలో అధికారంలోకి రాగలిగినది.

ఆచరణ పూర్వకమైన విధానాలతో ప్రజానాయకుడిగా ఉద్దానం, డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ప్రైవేటీకరణ వంటి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాడు. కానీ ఆతరువాత తన పార్టీని పటిష్టం చేసుకోకుండా తిరిగి సినిమాలలో నటించడం మొదలు పెట్టాడు. 2019లో జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీని పోటీకి నిలిపాడు. తాను స్వయంగా భీమవరం, గాజువాకలలో రెండు చోట్ల పోటీ చేసాడు. ఈ ఎన్నికలలో తాను రెండు స్థానాలలోనూ పరాజయం పాలవ్వగా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానంలో గెలుపొందగలిగింది. తెలంగాణాలోనూ పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. రెండేళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసిన పవన్ కళ్యాణ్ ఇటీవలే తిరిగి కెమెరా ముందుకొచ్చారు.

Pspk

వేణు శ్రీరామ్ దర్శత్వంలో రూపొందుతున్న వకీల్ సాబ్ మూవీ చేస్తున్న ఆయన ఆ తర్వాత క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. ఇక సినిమా రంగంలోనూ, అటు రాజకీయ రంగంలోనూ పవన్ విజయాన్ని సాధించాలని కోరుకుందాం. “నవ్యమీడియా” తరపున పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Related posts