telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ వాయిదా కారణంగా బీసీసీఐకి ఎంత నష్టం అంటే…?

sourav ganguly as bcci president

బీసీసీఐ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను అర్ధాంతరంగా నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ నిరవధికంగా వాయిదా పడటంతో బీసీసీఐ భారీ నష్టాల్ని చవిచూడనుంది. దాదాపు రూ.2,000 కోట్ల నుంచి 2,500 కోట్ల మధ్య నష్టాల్ని చవిచేసే అవకాశం ఉందని ఓ సీనియర్‌ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. సుమారు రూ.2200 కోట్ల మేర కోల్పోనుందని చెప్పుకొచ్చారు. అయితే ఆ మొత్తాన్ని బోర్డే భరిస్తుందని ఆయన తెలిపారు. ప్రతి ఏటా ఐపీఎల్ టీ20 లీగ్‌ను బీసీసీఐ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన ఆదరణ ఉంది. దీంతోనే ప్రసారదార్లు (బ్రాడ్‌కాస్టర్లు), స్పాన్సర్‌షిప్‌ల నుంచి బీసీసీఐ భారీ మొత్తంలో ఆదాయం ఆర్జిస్తుంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రసారం చేసేందుకు స్టార్‌ స్పోర్ట్స్ ఛానెల్‌ ఐదేళ్ల కాలానికి రూ.16,347 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లెక్కన ఏటా 60 మ్యాచ్‌లకు రూ.3270 కోట్లు.. ఒక్క మ్యాచ్‌కు దాదాపు రూ.54.5 కోట్లు వస్తాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 24 రోజుల్లో 29 మ్యాచ్‌లు జరిగాయి. అందుకు స్టార్‌ స్పోర్ట్స్‌ రూ.1580 కోట్లు చెల్లించనుంది. ఐపీఎల్ 2021 మిగతా మ్యాచ్‌లు జరగనందున బీసీసీఐకి రూ.1690 కోట్ల మేర నష్టాలు భరించాల్సి రావచ్చు.

Related posts