telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

చావుకే_చలేసింది

ఆకలి చావులతో మనిషి అలమటిస్తుంటే

తీరని ఆకలికోసం మనసు పరితపిస్తుంటే

చలికి చావని మనిషి కోరికలు పరుగులెడ్తుంటే

మాంసం కప్పిన ఎముకలగూడు వణికిపోతుంటే

రూపంలేని మనసుకి మార్గాలేర్పడకుంటే

మనసుని చంపలేని చావుకి చలేసింది

మనిషి దేహానికి తప్పా మనసుకి చావులేదు

మత్తెక్కించే దారుల్లో మరణాన్ని లిఖిస్తూ

మనుషుల మధ్యా ప్రపంచశాంతిని జపిస్తూ

మనిషి దేహానికి అతుక్కొన్న తోలుపలకలకు

అద్దెరంగులకు,మెరుగులకు కాలం చెల్లకముందే

మనిషిని చంపేసే చావుకు చలేసింది

మనసుల్లేకుండా దేహాలతో బ్రతుకుతూ

ఆలోచనల్లేకుండా ఆశలతో కదులుతూ

మనుషుల్లోనే జీవచ్ఛవాలుగా నలుగుతూ

నవ్వులనటనతో పువ్వులు పూయిస్తూ

మర్మాలన్నీ దాచేసి మాయల గాలానికి

అమాయకుల్ని అతికించే మనుషుల్ని చూసి

చావుకి వణుకుపుట్టించేంతగా చలేసింది

మనసులో చిక్కటి చీకట్లని అతికించుకొని

ఒంటికి నాటకాభరాణాల్ని తగిలించుకొని

మనుషుల్ని మరబొమ్మలుగా మల్చుకొని

అధికారంకోసం మనస్సాక్షిని చంపుకొని

రాక్షసులుగా మారి సమాజాన్ని కరిగించుకొని

దాహం తీర్చుకొనే దుర్మార్గుల్ని చంపలేకా

చావలేని చలికి నిజంగానే చలేసింది.

Related posts