ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు సంచలన లేఖ రాశారు. తొలుత ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన రఘువీరా.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి మద్దతు ఇవ్వొద్దన్న ఆయన కేంద్రంలో తమతో కలిసి ముందుకు రావాలని కోరారు.
ఈ సందర్భంగా రఘువీరా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించిందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకమన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను గుర్తు చేశారు. అంతేకాదు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు కూడా మద్దతు తెలిపాలని కోరారు. కాగా, తెలంగాణలో టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య బద్ధ శత్రుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రంలో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలంటూ రఘువీరారెడ్డి రాసిన లేఖ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.