రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష చేపట్టారు. ఆర్‌అండ్‌బి, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖలపై సీఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘అక్టోబరు నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయి. తర్వాత పనుల కాలం మొదలవుతుంది. ముందుగా రోడ్లను బాగుచేయడంపై దృష్టిపెట్టండి. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాలి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాం. గత ప్రభుత్వంలో రోడ్లను పూర్తిగా విడిచిపెట్టారు’’ అని పేర్కొన్నారు.
రోడ్లను బాగుచేయడానికి ఇప్పటికే చాలావరకూ టెండర్లు పిలిచారు. మిగిలిన చోట్ల కూడా ఎక్కడైనా టెండర్లు పిలవకపోతే వెంటనే టెండర్లు పిలవండి. అక్టోబరులో వర్షాలు ముగియగానే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోండి. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకోండి. మరొకసారి నిశితంగా వాటిని పరిశీలించండి. నివేదికలు ఆధారంగా ఫోకస్ పెట్టి వాటిని బాగుచేయండిసంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలిసి కూర్చుని కార్యాచరణచేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి ఎం శంకరనారాయణ, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ కె వెంకటరెడ్డి, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవెన్, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎం ఎం నాయక్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.