telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అమర్నాథ్ యాత్రలో విషాదం..ఇద్దరు ఏపీ మహిళలు మృతి

అమర్ నాథ్ యాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. ఈ నెల 8న అమర్‌నాథ్‌ గుహ వద్ద సంభవించిన ఆక్మసిక వరదల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సుధ, పార్వతి అనే మహిళలు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి మొత్తం84 మంది అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారు. వారిలో ఇద్దరు తప్ప మిగిలన వారంతా క్షేమంగా ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది. సుధ మృతదేహాన్ని భర్త విజయ్‌ కిరణ్‌ గుర్తించారు. భౌతిక కాయాలను స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన వారిని కూడా సురక్షితంగా ఏపీలోని వారి ప్రాంతాలకు పంపించేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

మ‌రోవైపు అమర్‌నాథ్‌ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది. ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయిన అమర్‌నాథ్‌ యాత్రను అధికారులు తిరిగి ప్రారంభించారు. 4,020మంది భక్తులతో కూడిన 12వ బ్యాచ్‌ దర్శనానికి బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. జమ్ములోని భగవతినగర్‌ యాత్రి నివాస్‌ నుంచి 110 వాహనాలు గట్టి బందోబస్తు మధ్య బేస్‌ క్యాంపులకు బయలుదేరినట్లు సైనికవర్గాలు ప్రకటించాయి.

అందులో 1016 మంది భక్తులు తెల్లవారుజామున 3:30 సమయంలో 35 వాహనాల్లో బాల్తాల్‌ బేస్‌ క్యాంపునకు బయలు దేరినట్లు తెలిపారు. మరో 2వేల 425మంది 75వాహనాల్లో పెహల్గావ్‌ బేస్‌ క్యాంపునకు బయలుదేరినట్లు పేర్కొన్నారు. ఈ ఉదయం పెహల్గావ్‌ మార్గంలోని నున్వాన్ బేస్ క్యాంప్ నుంచి యాత్రికుల బృందం వెళ్లిందని అధికారులు తెలిపారు. యాత్రికులందరూ రేపు అమర్‌నాథ్‌ మంచు లింగాన్ని దర్శించుకుంటారని పేర్కొన్నారు.

Related posts