telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ మొత్తాన్ని అందజేస్తున్నారు. నెలనెలా దాదాపు 95 శాతం మందికి పెన్షన్లు ఇంటివద్దే అందిస్తున్నారు. వేలిముద్రలు పడకపోవడం, లబ్ధిదారులు ఇళ్లవద్ద లేకపోవడంతో అలాంటి వారికి మాత్రం సాయం అందకుండా పోతోంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై రేషన్ మాదిరిగానే పెన్షన్ కూడా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా తీసుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం.. వ్యక్తిగత, కుటుంబ, ఆరోగ్య కారణాల వల్ల స్వగ్రామాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఈ అవకాశం వర్తింపజేయాలని పేర్కొంది. అయితే, 6 నెలల పాటు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నట్లు వారు ధ్రువీకరించాల్సి ఉంటుందని వెల్లడించింది. అలాగే లబ్ధిదారులు నివాసముంటున్న గ్రామ/ వార్డు వాలంటీర్ ద్వారా సచివాలయానికి లబ్ధిదారులను మ్యాపింగ్ చేస్తామంటున్నారు అధికారులు. కాగా.. ప్రస్తుతం వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, డయాలసిస్ పేషెంట్లు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు ఇస్తోంది జగన్ సర్కార్. అయితే, ప్రతీ నెల స్వగ్రామానికి రావడం కొందరికి ఇబ్బందిగా మారింది.. కానీ, ప్రభుత్వ నిర్ణయంతో మొత్తంగా పెన్షన్‌ దారులకు ఇది ఊరట కలగనుంది.

Related posts