నెల్లూరు జిల్లాలో వైసీపీ వర్గ పోరుపై ఏపీ సీఎం జగన్ సీరియస్‌గా తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కు మాజీ మంత్రి అనిల్ కుమార్ .. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిలను పిలిపించి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నిజంగా ఒకరితో ఒకరికి సమస్య ఉంటే తనతో వచ్చి చెబితే సరిదిద్దుతానని.. ఇలా బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయోద్దని క్లాస్ పీకినట్లు సమాచారం
సీఎం జగన్‌తో భేటీ ముగిసిన అనంతరం.. మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి నెల్లూరు రావడంతో సభ పెట్టానని.. కార్యకర్తలతో అనిల్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారని కాకాణి గోవర్థన్ రెడ్డి చెప్పారు.
అనిల్‌తో విభేదాలన్నది మీడియా సృష్టే…పార్టీ కోసం అందరం కలిసి పనిచేస్తాం. వైసీపీ అధికారంలో లేనప్పుడు అనిల్ కుమార్‌తో కలిసి పనిచేశానని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. పార్టీ బాగుండాలని.. తాము చెట్టును నరుక్కునే వ్యక్తులం కాదని మంత్రి పేర్కొన్నారు.
అనిల్ నాకు సోదరుడి లాంటి వాడు. కావాలనే మా మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం చేశారు’’ అని మంత్రి కాకాణి పేర్కొన్నారు