బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి నోరుజారారు. ఇప్పటివరకు తమ పార్టీకి మద్దతు ప్రకటించిన వారు విరమించుకుంటూ ఉండటంతో.. పొత్తులు పెట్టుకొని పక్షంలో కనుమరుగయ్యేది మీరే అంటూ.. తీవ్రంగా హెచ్చరికలు జారీచేశారు. తాజాగా, తమ మిత్రపక్షమైన శివసేనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హెచ్చరికలు జారీ చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకునే పార్టీలను తాము గెలిపించుకుంటామని… పొత్తు పెట్టుకోని పక్షంలో ఆ పార్టీలు కనుమరుగైపోతాయని అన్నారు. మహారాష్ట్రలోని లాతూరులో ఉస్మానాబాద్, హింగోలి, నాందేడ్, లాతూరు జిల్లాల పార్టీ శ్రేణులతో అమిత్ షా, ముఖ్యమంత్రి ఫడ్నవిస్ లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫడ్నవిస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ 40 నుంచి 48 స్థానాలను కైవసం చేసుకోవాలని, దీని కోసం బీజేపీ కార్యకర్తలంతా కష్టపడాలని చెప్పారు.
అమిత్ షా మాట్లాడుతూ, శివసేనతో పొత్తు విషయంలో బీజేపీ శ్రేణులు గందరగోళానికి గురి కావద్దని సూచించారు. వాళ్లు మనతో పొత్తుకుంటే వారి విజయానికి మనం హామీ ఇస్తామని… లేని పక్షంలో వారిని చిత్తుగా ఓడిద్దామని పిలుపునిచ్చారు. ఈ దిశగా ప్రతి బూత్ స్థాయిలో కార్యాచరణను మొదలుపెట్టాలని దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే… రానున్న 50 ఏళ్ల పాటు బీజేపీదే అధికారమని తెలిపారు. 2014 ఎన్నికల్లో యూపీలో 73 లోక్ సభ స్థానాలను గెల్చుకున్నామని… ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలిపినా… మనం 74 స్థానాలను గెలుచుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు, శివసేన కూడా అమిత్ షా వ్యాఖ్యలపై అదే స్థాయిలో స్పందించి, ఎవరి సవాళ్లనైనా స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. బీజేపీ నిజస్వరూపాన్ని అమిత్ షా వ్యాఖ్యలు బట్టబయలు చేశాయని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేకు అత్యంత సన్నిహితుడైన ఒక నేత విమర్శించారు. హిందుత్వ, రామ మందిరం నిర్మాణం గురించి తొలి నుంచి తాము మాట్లాడుతున్నామని… కానీ, మరెవరూ హిందుత్వ గురించి మాట్లాడకూడదని బీజేపీ కోరుకుంటుందని అన్నారు. హిందుత్వ విషయంలో బీజేపీతో కలసి తమ ప్రయాణం సరిగా ముందుకు సాగడం లేదని చెప్పారు.
ఇటీవలి కాలంలో బీజేపీపై శివసేన విమర్శల దాడిని పెంచింది. రామ మందిరం నిర్మాణం విషయంలో కూడా బీజేపీపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చేందుకు యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో, రానున్న ఎన్నికల్లో బీజేపీతో శివసేన పొత్తుపెట్టుకోకపోవచ్చనే వార్తలు వెల్లువుత్తుతున్నాయి. తాజాగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో… రెండు పార్టీల మధ్య బంధం మరింత చెడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
కుప్పం కెనాల్ పనుల నిలిపివేతపై చంద్రబాబు ఫైర్