telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తాం.. హోంమంత్రి అమిత్ షా

కేసీఆర్‌ సర్కార్‌ను పడగొట్టేందుకు నేడు రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ‘మునుగోడు సమరభేరి’ పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మిత్రుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక కేసీఆర్ సర్కార్‌ను కూకటివేళ్లతో సైతం కూల్చేసే ఘట్టమని అమిత్ షా అన్నారు. 

కేసీఆర్ సర్కార్‌ని పడగొట్టేందుకు ఇది ఆరంభమన్నారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్‌ అవినీతి సర్కారు మాయం అవుతుందన్నారు. కేసీఆర్‌ సర్కార్‌.. అబద్ధాలకోరు ప్రభుత్వం అంటూ ఆయన దుయ్యబట్టారు.

మునుగోడు ఉపఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌ పతానానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు.

మజ్లిస్‌ భయంతోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్‌ జరపట్లేదని.. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని జరిపిస్తామని అమిత్‌షా ప్రకటించారు. 

నిరుద్యోగ యువతకు 3 వేలు ఇస్తామని వాగ్థానం చేశారని.. అమలు జరుగుతోందా అని అమిత్ షా ప్రశ్నించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం హామీ ఏమైందని ఆయన నిలదీశారు. పేద, బడుగు వర్గాలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల హామీ ఏమైందని అమిత్ షా ప్రశ్నించారు. దళిత సీఎం హామీ ఏమైందని కేసీఆర్‌ను నిలదీశారు. హుజురాబాద్ ఎన్నికల వేళ దళితబంధు హామీ ఇచ్చారని.. కానీ అమలు జరుగుతోందా అని ఆయన ప్రశ్నించారు.

కేసీఆర్‌ దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ గెలిస్తే కేసీఆర్‌ స్థానంలో కేటీఆర్‌ వస్తారంటూ’’ అమిత్‌షా ధ్వజమెత్తారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రిని చూస్తారని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు.

తెలంగాణ రైతుల్ని కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందని .. ప్రధాని రైతు బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రతీ రైతు నుంచి ధాన్యం సేకరిస్తామని.. దొడ్డు బియ్యం కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఏటీఎం లాంటిదని అమిత్ షా చురకలు వేశారు.

తెలంగాణలోని కేసీఆర్‌ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని తీవ్ర స్థాయిలో విమర్శించారుప్రధాని ఇస్తున్న టాయిలెట్లలోనూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తమపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు తప్పా.. రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు.. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధికి అండగా వుంటామని కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చారు.

Related posts