telugu navyamedia
సినిమా వార్తలు

షూటింగ్​లో ప్రముఖ నటుడు నాజర్‌కు గాయాలు​, ఆస్పత్రికి తరలింపు

సీనియర్ నటుడు నాజర్ కు గాయాలయ్యాయి. ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా తెలంగాణా పోలీస్ అకాడమీ ప్రాంగణంలో షూటింగ్ నిర్వహించారు.ఆ సమయంలో మెట్లపై నుంచి దిగుతుండగా.. నాజర్ జారి పడడంతో ఆయన ఆయన ఎడమ కన్ను కింద కణతి భాగంలో గాయ‌మైంది .

దీంతో ఆయనకు రక్తస్రావం కావడం వల్ల.. వెంటనే అక్కడే ఉన్న షూటింగ్​ సిబ్బంది ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందించారు. చిన్న గాయాలేనని వైద్యులు తెలిపారు. నాజర్ తో పాటు నటి సుహాసిని, హీరోయిన్ మెహ్రీన్, శియాజి శిండే లు కూడా షూటింగ్ లో పాల్గొన్నారు.

ప్రాథమిక చికిత్స అనంతరం నాజర్‌ ఇంటికి వెళ్లిపోయారు. అయితే అప్పటికే ఈ విషయం తెలుసుకున్న ఆయన సన్నిహితులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

నటుడిగా నాజర్‌కు సౌత్ లో మంచి పేరుంది. ఇప్పటివరకు వందకు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారాయన. నటుడిగానే కాకుండా.. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కూడా వర్క్ చేశారు. 1985లో ‘కల్యాణ అగితీగల్‌’ సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు నాజర్. ఆ తర్వాత ‘నాయకన్‌’ సినిమాతో అతడికి మంచి బ్రేక్ వచ్చింది. ఆ తరువాత వరుసగా హిట్ సినిమాల్లో నటించారు. ‘రోజా’, ‘తేవర్‌ మగన్‌’, ‘బొంబాయి’, ‘కురుతి పునల్‌’…లాంటి సినిమాల్లో మంచి పాత్రలు పోషించారాయన.

నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా సినిమాలు చేశారు. 1995లో ‘అవతారం’ సినిమాను డైరెక్ట్ చేశారు. జానపద సంస్కృతి, కళారూపాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 1997లో ‘దేవతార్‌’ అనే మరో సినిమాను కూడా డైరెక్ట్ చేశారు. ఆ తరువాత ‘మాయన్’, ‘పాప్ కార్న్’, ‘సన్ సన్ తాతా’ సినిమాలకు దర్శకుడిగా పని చేశారు. మొత్తంగా కెరీర్​లో 100కిపైగా చిత్రాల్లో నటించారు.

Related posts