16 మంది సెలబ్రెటీలు బిగ్‌బాస్ 4 హౌస్‌లో అడుగు పెట్టడంతో సందడి మొదలైంది. మొత్తానికి ఈ వారంలో ఎలిమినేషన్‌లో అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్థక్, దివి, మెహబూబా, సుజాత, గంగవ్వ ఉన్నారు. మొదటి వారంలోనే అందరూ కలిసి ఆమెను ఎలిమినేషన్ రౌండ్‌కు పంపించారు. అయితే కంటెస్టెంట్స్ అందరిలో గంగవ్వే పాపులర్ అవుతోంది. అంతేకాదు అవ్వకు ఆర్మీ కూడా తయారైంది. కాగా ఈసారి కంటెస్టెంట్ల సెలక్షన్ బాలేదని ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్లు వస్తుండగా, బిగ్ బాస్ రెండో సీజన్ లో విజేతగా నిలిచిన కౌశల్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హౌస్ లో ఉన్న పోటీదారుల ప్రతిభపై ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేమని, అయితే, ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఓ పల్లెటూరు నుంచి వచ్చిన బామ్మ గంగవ్వను ఎంపిక చేయడం మాత్రం ఓ అసాధారణ నిర్ణయమని, ఆమె కనీసం 10 వారాల పాటు హౌస్ లో కొనసాగుతారని భావిస్తున్నానని అన్నారు. పల్లెటూర్లలో ఈ షోను తిలకించే వారి సంఖ్యను పెంచాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని కౌశల్ అభిప్రాయపడ్డారు. ఈ సీజన్ లో సూర్యకిరణ్, ఏ విషయంలోనైనా తన మాటే సరైనదన్న విధంగా వాదనకు వస్తున్నాడని, అలా చేస్తే, టీవీలో ఎక్కువగా కనిపించవచ్చేమోగానీ, అన్ని వేళలా కాదని, సూర్యకిరణ్ తన ప్రవర్తనకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ సీజన్ లో సైతం కంటెస్టెంట్లకు అభిమానుల క్లబ్ లు మొదలయ్యాయని గుర్తు చేసిన కౌశల్, ఓ పోటీదారు కోసం కౌశల్ ఆర్మీ చేసిన ర్యాలీ మాత్రం ‘నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. కరోనా కారణంగా కొన్ని నెలల పాటు ఉపాధిని కోల్పోయిన సెలబ్రిటీలు, తిరిగి ఉపాధిని వెతుక్కునే పనిలో ఉన్నందునే హౌస్ లోకి వెళ్లేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తిని చూపకపోయి ఉండవచ్చని కౌశల్ వ్యాఖ్యానించారు.
previous post