telugu navyamedia
ఆంధ్ర వార్తలు

గోరంట్ల మాధవ్ సభ్యసమాజం తలదించుకునే ప‌ని చేసి …ఏ మొహం పెట్టుకుని వచ్చాడు..

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సభ్యసమాజం తలదించుకునే పని చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి.. జాతీయ జెండా వందనానికి ఏ మొహం పెట్టుకుని వచ్చాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు .

సత్యసాయి జిల్లా లేపాక్షిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రజలకు సేవ చేయకుండా.. నీలి చిత్రాలు చూపించారు అని విమర్శించారు.

ఎంపీ గోరంట్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సీఎం జగన్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

ఎంపీ గోరంట్ల మాధవ్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండా ఆవిష్కరణకు రావడంతోనే టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని.. ఆ సమయంలో పోలీసులు తమ లాఠీలతో జులుం ప్రదర్శించారంటూ బాలకృష్ణ మండిపడ్డారు. అలాంటి వీడియోలు చేసిన వ్యక్తి ఇలాంటి పనులా చేసేదంటూ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.

తమ పార్టీ కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని.. ఎవరికీ భయపడమంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని.. సరైన సమయంలో గుణపాఠం చెబుతారంటూ బాలయ్య వైసీపీ ప్రభుత్వానికి  హెచ్చరికలు జారీ చేశారు.

చేతకాని పాలనతో ప్రజలను కష్టాల పాలు చేశారని విమర్శించారు. అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, వైసీపీ ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేసిందన్నారు. కనీసం ఎరువులు, విత్తనాలను రాయితీపై ఇవ్వడం లేదని అన్నారు. ఈ కార్యక్రమానికి టిడిపి నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

మరోవైపు ఏపీ మంత్రులపై కూడా నందమూరి బాలకృష్ణ విమర్శలు చేశారు. ఏ మంత్రికి ఏ అధికారం ఉందో ఎవరికీ తెలియదని.. మంత్రుల కాన్వాయ్‌లకు డీజిల్ ఖర్చు కూడా దండగే అంటూ విమర్శించారు. సంక్షేమ పథకాల అమలులోనూ కోత పెడుతున్నారని.. స్థానిక నాయకులు అవకతవకలకు పాల్పడుతున్నారని నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి ఓటేసి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీజేపీకి దాసోహం అందని.. 25 మంది ఎంపీలను ఇస్తే తెస్తామన్న ప్రత్యేక హోదా ఏదంటూ ఆయన చురకలు అంటించారు.

Related posts