telugu navyamedia
క్రీడలు వార్తలు

ఏది ఏమైనా ఢిల్లీ కెప్టెన్ అయ్యరే…

ఐపీఎల్ 2021లో శ్రేయస్‌ అయ్యర్‌ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించే అవకాశం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అంచనా వేశారు. గాయంతో టోర్నీకి దూరమై.. కోలుకొని తిరిగొస్తే జట్టులోకి తీసుకోకూడదన్న నియమమేమీ లేదన్నారు. సారథిగా రిషబ్ పంత్ నిరూపించుకున్నా.. తిరిగొస్తే అయ్యరే ఢిల్లీ కెప్టెన్ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు. కరోనా కేసులు పెరగడంతో మార్చి 4న అనూహ్య ప‌రిస్థితుల్లో ఐపీఎల్ 2021ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేసింది. ఐపీఎల్ 2021లో ఆగిపోయేసమయానికి 29 మ్యాచులే పూర్తయ్యాయి. అయితే శ్రేయస్‌ తిరిగొస్తే అతడికి సారథ్యం ఇస్తారా లేదా అని సోషల్‌ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆకాశ్ చోప్రా ఇలా సమాధానం ఇచ్చాడు. ‘కచ్చితంగా అయ్యరే ఢిల్లీ కెప్టెన్.. అందులో సందేహమే లేదు. గాయం నుంచి కోలుకొని తిరిగొస్తే అయ్యర్‌కు సారథ్యం ఇస్తారు. మూడో స్థానంలో కూడా బ్యాటింగ్‌ చేస్తాడు. తుది జట్టులో ఆడతాడు. ఇప్పటికే ఢిల్లీ పటిష్టంగా ఉంది. ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో ఉంది. శ్రేయస్‌ రాకతో మరింత బలం పుంజుకుంటుంది. టోర్నీకి దూరమయ్యాక తిరిగి రావొద్దన్న నిబంధనలు ఎక్కడా లేవు. అతడు ఫిట్‌నెస్‌ సాధిస్తే కచ్చితంగా పునరాగమనం చేస్తాడు’ అని ఆకాశ్ బదులిచ్ఛాడు.

Related posts