వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ఏపీ సీఎం జగన్ ఏలూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత మంచి పథకం లేదని జగన్ అభిప్రాయపడ్డారు. ఇంతవరకూ ఆరోగ్య శ్రీ పథకం కింద దాదాపు 1059 వ్యాధులకు మాత్రమే వైద్యం అందేదని, ఇకపై 2,059 వ్యాధులకు వైద్యం అందుతుందని జగన్ ప్రకటించారు. వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
వ్యాధి తగ్గిన తరువాత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తే, బాధితుడికి నెలకు రూ. 5 వేలు చొప్పున ఇస్తామని జగన్ వ్యాఖ్యానించారు. గత ఏడు నెలలుగా ఆరోగ్య శ్రీ సేవల్లో విప్లవాత్మక మార్పులను తెచ్చేందుకు ఎంతో కృషి చేశామని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు మూడు నెలల పాటు కొనసాగుతుందని తెలిపారు.
ఆరు నెలలు తిరిగేసరికి రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వస్తుందని జగన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అన్ని రకాల క్యాన్సర్లకూ ఆరోగ్య శ్రీ వర్తించడం లేదని, ఇకపై ఆ పరిస్థితి ఉండబోదని జగన్ వెల్లడించారు. ఫిబ్రవరి 1 నుంచి క్యాన్సర్ పేషంట్లకు రూపాయి కూడా ఖర్చు కాకుండా వైద్య చికిత్సలను అందించేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయని ఆయన పేర్కొన్నారు.