సామాజిక సమస్యలపై స్పందించడంలో పవన్ కల్యాణ్ ముందుంటాడని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ లో జనసేనాని కార్యాలయంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను వీహెచ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేల ఎకరాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై చర్చించారు.
అనంతరం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ నల్లమలలో యురేనియం తవ్వకాల వల్ల అటవీప్రాంతం దెబ్బతింటుందని, వన్యప్రాణులకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఇలాంటి విషయాన్ని ప్రజల్లోకి పవన్ బలంగా తీసుకెళ్లగలడని కితాబిచ్చారు. అందుకే తాను పవన్ కల్యాణ్ ను కలిశానని వివరించారు.
నల్లమలలో యురేనియం తవ్వితే, అక్కడి జలాలు కృష్ణా నదిలో కలుస్తాయని, ఆ నీటిని హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ ప్రాంతాల వాళ్లు తాగుతారని, తద్వారా ప్రమాదకర అనారోగ్యం బారిన పడతారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోనూ కృష్ణా, ప్రకాశం, గుంటూరు తదితర ప్రాంతాల్లోనూ ఈ నీటిని తాగుతారని చెప్పారు.ఈ విషయం పవన్ కల్యాణ్ కు చెప్పగానే ఆయన వెంటనే స్పందించారని అన్నారు. నిపుణులతో సదస్సు ఏర్పాటు చేద్దాం అంటూ ముందుకువచ్చారని వీహెచ్ వెల్లడించారు.


జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు: యనమల