ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు.
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన గ్రీన్ ఫీల్డ్ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని జాతీయ రహదారుల నెట్వర్క్ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ భేటీలో ప్రధానంగా కృష్ణానదిపై ప్రతిపాదించిన 6 లేన్ల ఐకానిక్ కేబుల్ స్టెడ్ వంతెన నిర్మాణంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించారు.
రాజధాని అమరావతికి తలమానికంగా నిలిచే ఈ ఐకానిక్ వంతెన నిర్మాణ బాధ్యతను జాతీయ రహదారుల సంస్థ చేపట్టాలని సీఎం చంద్రబాబు కోరారు.
మూలపాడు వద్ద నిర్మించే ఈ వంతెన ద్వారా అమరావతిని మూడు కీలక జాతీయ రహదారులతో అనుసంధానించవచ్చని వివరించారు.
విజయవాడ-హైదరాబాద్, చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారులతో పాటు తీరప్రాంత రోడ్ కారిడార్‌ను ఈ వంతెన నేరుగా కలుపుతుందని సీఎం తెలిపారు.
హైదరాబాద్ నుండి అమరావతి వరకు ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ హైవే గురించి గడ్కరీతో సీఎం చర్చించారు.
ఈ హై-స్పీడ్ యాక్సెస్ కంట్రోల్ రోడ్డు అందుబాటులోకి వస్తే రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్రానికి ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరగా, దీనిపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు.


ఈవోని మంత్రి వెనకేసుకొస్తున్నారు: దేవినేని ఉమ