telugu navyamedia
సినిమా వార్తలు

70 సంవత్సరాల “చంద్రహారం”.

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన జానపద చిత్రం విజయా ప్రొడక్షన్స్ వారి “చంద్రహారం” 06-01-1954 న విడుదలయ్యింది. నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి లు విజయా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ: ఎల్.వి.ప్రసాద్, కథ,మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు, సంగీతం: ఘంటసాల, ఛాయాగ్రహణం: మార్కస్ బార్ట్ లే, కళ: మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే, నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, ఎడిటింగ్: సి.పి.జంబులింగం, అందించారు. ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, శ్రీరంజని, సావిత్రి, యస్.వి. రంగారావు, సూర్యకాంతం, పద్మనాభం, రేలంగి తదితరులు నటించారు. విజయా ప్రొడక్షన్స్ సంస్థ తమ 4 వ చిత్రంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే అంతవరకూ ఎవరూ ఖర్చుపెట్టని విధంగా 25 లక్షల రూపాయలు భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఘంటసాల గారి సంగీత సారధ్యంలో స్వరపరచిన పాటలు
“ఎవరివో ఎచట నుంటివో”
“ఇది నా చెలి ఇది నా సఖి”
“ఏనాడు మొదలెడితివో”
వంటి పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.

కమలాకర కామేశ్వరరావు గారికి దర్శకునిగా ఇదే మొట్టమొదటి చిత్రం, కాగా అత్యంత భారీబడ్జెట్ తో నిర్మింపబడిన తొలి తెలుగు చిత్రం కూడా ఇదే కావటం విశేషం. భారతదేశంలో టెలివిజన్స్ లేని ఆ కాలంలోనే ఈ సినిమా లోని “చంద్రుడు కలువలు పాట” ను బి.బి.సి వరల్డ్ న్యూస్ ఛానల్ లో ప్రసారమై సంచలనం సృష్టించింది.

కనువిందు చేసే సెట్టింగ్స్, మార్కస్ బార్ట్లీ అద్భుతమైన ఫోటోగ్రఫీ, మరియు గతంలో తమ సంస్థ నిర్మాణం లో ఘనవిజయం సాధించిన “పాతాళభైరవి”(1951) చిత్రాన్ని మించి పబ్లిసిటీ చేసినప్పటికి ఈ చిత్రం నిర్మాతలు ఆశించిన మేరకు విజయవంతం కాలేక పోయింది. కాగా ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ కొన్ని కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శింపబడింది.
విజయవాడ – దుర్గా కళామందిర్ 10 వారాలు ప్రదర్శింపబడింది….

Related posts