telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

62 సంవత్సరాల “గులేబకావళికథ”.

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన జానపద చిత్రం ఎన్.ఏ.టి. వారి “గులేబకావళికథ” 05-01-1962 విడుదలయ్యింది. ఎన్.టి. రామారావు గారి సోదరుడు నందమూరి తివిక్రమరావు గారు నిర్మాత గా ఎన్.ఏ.టి. (నేషనల్ ఆర్ట్ థియేటర్స్) బ్యానర్ పై ఎన్.టి.ఆర్. గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి మాటలు: సముద్రాల రామానుజాచార్య పాటలు: సి.నారాయణరెడ్డి, సంగీతం: జోసెఫ్, కృష్ణమూర్తి, ఛాయాగ్రహణం: రవికాంత్ నగాయిచ్, నృత్యం: వెంపటి సత్యం, కళ: కొరటాల నరసింహారావు, కూర్పు: ఎస్.పి.ఎస్.వీరప్ప, అందించారు. ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, జమున, నాగరత్నం, ఋష్యేంద్రమణి, రాజనాల, ముక్కామల, పద్మనాభం, మిక్కిలినేని, పేకేటి, ఛాయాదేవి, హేమలత,సురభి బాలసరస్వతి,వల్లూరి బాలకృష్ణ, మీనా కుమారి, చదలవాడ,మహంకాళి వెంకయ్య, తదితరులు నటించారు.

ప్రముఖ సంగీత దర్శకులు జోసెఫ్, కృష్ణమూర్తి లు స్వరపరిచిన పాటలన్నీ హిట్ అయ్యాయి.
“నన్ను దోచుకొందు వటే వన్నెల దొరసానీ”
“సలామలేకుం సాహెబు గారూ,బలే షోకుగా వచ్చారా”
“ఒంటరినై పోయాను ఇక యింటికి ఏమని పోనూ”
“మదనసుందర నా దొరా,నామది నిన్ను గని పొంగినదిరా”
“కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై’
“విన్నావా తత్వం గురుడా,కనుగొన్నావా సత్యం నరుడో నరుడా”
వంటి పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.

సంగీత దర్శకులు జోసెఫ్, వేలూరి కృష్ణమూర్తి లకు ఇది మొదటి సినిమా .జోసెఫ్ కృష్ణ ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎస్.విశ్వనాథన్ వద్ద అసిస్టంట్ గా పనిచేశారు. వేలూరి కృష్ణమూర్తి విజయవాడ కు చెందిన సంగీత విద్వాన్. ప్రముఖ రచయిత డా॥సి.నారాయణరెడ్డి గారు ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలోని పాటలన్నీ నారాయణరెడ్డి గారే వ్రాసారు. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించిన నాగరత్న కూడా ఈ చిత్రం ద్వారా పరిచయమైంది.

సీతారామకళ్యాణం (1961) సినిమా తర్వాత ఎన్.టి. రామారావు గారు దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన రెండవ చిత్రం “గులేబకావళి కథ”. అయితే సినిమా కు కూడా టైటిల్స్ లో ఎన్టీఆర్ గారు దర్శకుడుగా పేరు వేసుకోలేదు. ఎన్.ఏ.టి బ్యానర్ కు ఎటువంటి చిహ్నం లేదు. తలనీలాలు సమర్పించి శ్రీవెంకటేశ్వర స్వామిని నిర్మాత త్రివిక్రమరావు పూజించేటప్పుడు శ్రీవెంకటేశ్వరస్వామి విగ్రహానికి కుడివైపు షావుకారు జానకి, ఎడమవైపు స్వర్ణ లను దేవతా మూర్తులుగా ఉంచి పూజా కార్యక్రమము చిత్రీకరించారు. తరువాత నందమూరి సోదరులు తమ తల్లిదండ్రులను పూజించే కార్యక్రమం చిత్రీకరించారు

ఈ చిత్రం ఘన విజయం సాధించి దాదాపు విడుదలైన అన్ని కేంద్రాలలో 50 రోజులు ఆడింది.
4 కేంద్రాలలో డైరెక్టుగా 100 రోజులు ప్రదర్శింపబడి
శతదినోత్సవం జరుపుకున్నది.
100 రోజులు ప్రదర్శింపబడిన కేంద్రాలు:-
1. విజయవాడ —- శ్రీలక్ష్మి టాకీస్ (119 రోజులు)
2. నెల్లూరు —- వెంకటేశ్వర
3. రాజమండ్రి — విజయా.
4. గుంటూరు —- హరిహర మహల్
థియేటర్లలో 100 రోజులు ప్రదర్శింపబడింది….

Related posts