telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

54 సంవత్సరాల “ తల్లా ? పెళ్ళామా ?”.

నటరత్న ఎన్.టి.రామారావు గారు స్వీయ దర్శకత్వంలో నటించిన సాంఘిక చిత్రం “తల్లా ? పెళ్ళామా ?” 08-01-1970 విడుదలయ్యింది. ఎన్టీఆర్ గారి సోదరులు నందమూరి త్రివిక్రమరావు గారు నిర్మాత గా ఆర్.కె.& ఎన్.ఏ.టి. బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో ఎన్.టి.రామారావు గారు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి కధ, స్క్రీన్ ప్లే : ఎన్.టి.రామారావు, మాటలు: సముద్రాల రాఘవాచార్య, సంగీతం: టి.వి.రాజు, పాటలు: సి.నారాయణరెడ్డి, కొసరాజు,  ఛాయా గ్రహణం: జె.సత్యనారాయణ,  నృత్యం: వెంపటి సత్యం, కళ: ఎస్.కృష్ణారావు, కూర్పు: జి.డి.జోషి అందించారు. ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు ,చంద్రకళ, నందమూరి హరికృష్ణ, శాంతకుమారి, దేవిక, సత్యనారాయణ, నాగయ్య, రేలంగి, రమణారెడ్డి, ప్రభాకర రెడ్డి, జ్యోతిలక్ష్మి, విజయలలిత, ముక్కామల, రావి కొండలరావు, ఛాయాదేవి తదితరులు నటించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు టి.వి.రాజు గారి సంగీత సారధ్యంలో పాటలన్నీ హిట్ అయ్యాయి.
‘ఓ బంగారు గూటిలోని చిలుక పెదముంగిట్లో వాలానని అలుక”,
” తెలుగు జాతి మనది నిండుగ వెలుగుజాతి మనది”
‘” తాగితే తప్పేముంది”
“బ్రహ్మం తాత చెప్పింది,నిత్యం జరిగే సత్యమిది”,
“మమత లెరిగిన నా తండ్రీ”
వంటి పాటలు శ్రోతలను అలరించాయి.

డా|| సి.నారాయణ రెడ్డి గారు వ్రాసిన “తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది” అంటూ ఘంటసాల పాడిన పాట ఆనాడు పెను సంచలనానికి దారితీసింది, జాతీయ సమైక్యతను ప్రభోధించే విధంగా ఈ పాటను రూపొందించారు ఎన్టీఆర్. ” తాగితే తప్పేముంది” పాటలలో ఎన్టీఆర్ గారు ఘంటసాల తో పాటలు స్వరం కలిపి పాడారు.

ఎన్టీఆర్ గారి తనయుడు నందమూరి హరికృష్ణ ఈ సినిమా లో బాలనటుడుగా నటించారు. చిత్ర కధకుడుగా ఎన్.టి.రామారావు గారికి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు. ప్రకటించింది .. సినిమా లో హీరోగా నటించి కథారచయిత గా రాష్ట్ర ప్రభుత్వ అవార్డ్అందుకున్న ఏకైక నటులు ఎన్టీఆర్ గారు.

ఈ చిత్రం ఘన విజయం సాధించి దాదాపు విడుదలైన అన్ని కేంద్రాలలో 50 రోజులు.
4 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి శతదినోత్సవం జరుపుకున్నది.
100 రోజులు ఆడిన కేంద్రాలు :-
1. విజయవాడ – దుర్గకళామందిరం (106 రోజులు),
2. గుంటూరు — నాజ్ అప్సర,
3. రాజమండ్రి — అశోక,
4. కాకినాడ — కల్పన
థియేటర్ లలో 100 రోజులు ప్రదర్శింపబడింది…
ఈ చిత్రాన్ని నిర్మాత, దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ గారు హిందీలో 1974 లో జితేంద్ర హీరోగా “బిడాయి” పేరు తో రీమేక్ చేశారు. ఈ సినిమా టైటిల్స్ లో కధా రచయిత గా ఎన్టీఆర్ గారి పేరును వేయటం జరిగింది. ఈ హిందీ సినిమా కూడా విజయం సాధించింది. అలాగే ఈ సినిమాని 1975 లో తమిళంలో “పిరియ విడై” పేరు తో రీమేక్ చేయటం జరిగింది…..

Related posts