హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 44కి చేరింది. గాయపడ్డ వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాద తీవ్రత భారీ స్థాయిలో ఉండడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అనేక మంది బస్సు పైభాగంలో ఉన్నారని అందుకే మృతుల సంఖ్య భారీగా ఉందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కులు నుంచి గదాగుషైణీకి వెళ్తుండగా 500 మీటర్లకుపైగా లోతు ఉన్న లోయలో బస్సు పడిపోయింది. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, డ్రైవరు నిర్లక్ష్యం వల్ల ప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు.
చనిపోయిన వారి కుటుంబాలకు జిల్లా యంత్రాంగం రూ.50వేల తక్షణ సాయం ప్రకటించింది. కులు జిల్లాలో ప్రభుత్వ బస్సు సర్వీసులు చాలా తక్కువగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందువల్లే ఉన్న బస్సుల్లోనే అధిక సంఖ్యలో ప్రయాణికులు ఎక్కాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. విచారణ జరిపి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటామని అధికారులు తెలిపారు. ఇప్పటికే మేజిస్ట్రేట్ స్థాయి అధికారితో విచారణ ప్రారంభించామన్నారు. ఈ ఘటన పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.