telugu navyamedia
వార్తలు

మాజీ ప్రధాని పీవీ జీవితం విలువలకు నిదర్శనం – మాజీ ప్రధాన కార్యదర్శి డా.మోహన్ కంద

అంబేద్కర్ వర్శిటీలో ఘనంగా మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు జయంతి
భారత మాజీ ప్రధాని, తెలుగు తేజం పి.వి.నరసింహా రావు 102వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో స్మారకోపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమైఖ్య ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ మాజీ సభ్యులు, మాజీ ఐ.ఎ.ఎస్. అధికారి డా.మోహన్ కంద హాజరయ్యారు. అయన మాట్లాడతూ “పాలన – విలువలు” అనే అంశంపై డా.మోహన్ కంద స్మారకోపన్యాసం చేశారు. పాలనలో జావాబుదారితనం అనేది మాజీ ప్రధాని పాలనలో బాగా కనిపించిందని పేర్కొన్నారు. పాలకులు, అధికారులు ప్రజల సేవకులుగా ఉండాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. పై స్థాయిలో ఉన్న అధికారులు అధికార దర్పం కంటే సామాన్య ప్రజలకు ఎంత మేరకు సేవ చేయగలుగుతున్నామో ఆలోచించు కోవాలన్నారు.

ఒక వైపు ప్రపంచంలో ఇతర దేశాలతో అభివృద్ధిలో పోటీ పడుతున్నామని చెప్పుతున్నా ఇంకో వైపు భిక్షాటన చేస్తున్న వారు దేశంలో అనేక మంది ఉన్నారని ఈ అంశాలను అటు పాలకులు ఇటు అధికారులు గుర్తు ఉంచుకోవాలని సూచించారు. దేశంలో చిన్న పిల్లలను అమ్ముకోవడాలు, మానభంగాలు, ఆత్మహత్యలు, పేదరికం, వరకట్న వేధింపులు, మత వైషమ్యాలు, దోపిడీలు, దాడులు అనేవి దేశ అభివృద్ధిని దెబ్బతీస్తాయని మొదట వీటిని పరిష్కరించాలని పాలకులకు ఆయన సూచించారు.

దేశ అంతర్గత భద్రత, వ్యక్తిగత భద్రత, ప్రజాస్వామ్య విలువలను కాపాడినప్పుడే పాలనలో పారదర్శకత, విలువలతో కూడిన నాణ్యమైన పాలన ప్రజలకు అందించినట్లుగా అవుతుందని పాలకులు, అధికారులు వీటిపై దృష్టిసారించాలని డా. కందా సూచించారు .
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. కె. సీతారామ రావు అధ్యక్షత వహించి ప్రసంగించారు. ప్రొ. రావు మాట్లాడతూ తెలంగాణా వైతాళికుల జీవిత విశేషాలు, సమాజానికి వారు చేసిన సేవలను భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతోనే విశ్వవిద్యాలయంలో క్రమం తప్పకుండా స్మారకోపన్యాసాలు నిర్వహిస్తున్నామని వివరించారు. మాజీ ప్రధాన మంత్రి పీవీ తన హయాంలో తెచ్చిన ఆర్ధిక సంస్కరణలు దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసినట్లు గుర్తు చేశారు. పాలనా సంస్కరణలు ఆయన హయంలోనే తెచ్చారని గుర్తు చేశారు.
కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఇంచార్జ్ అకాడమిక్ డైరెక్టర్ ప్రో.సుధారాణి ముఖ్య కార్యక్రమ ప్రాధాన్యతను, ఇప్పటి వరకు నిర్వహించిన పీవీ స్మరకోపన్యాసాల వివరాలను సభ దృష్టికి తెచ్చారు. యు.జి.సి. – డి.ఇ.బి. అఫైర్స్ ఇంచార్జ్ డైరెక్టర్ డా. పల్లవి కాబ్డే వందన సమర్పణ చేశారు. సికా డైరెక్టర్ ప్రొ. పీ. మధుసూదన్ రెడ్డి, డీన్ లు ప్రొ షకీలా ఖానం, ప్రొ.వడ్డానం శ్రీనివాస్, విద్యార్ధి సేవల విభాగం డైరెక్టర్ డా.ఎల్వీకే రెడ్డి, ప్రచురణల విభాగ డైరెక్టర్ డా. గుంటి రవి బోధన మరియు భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పీవీ కుటుంభ సభ్యులు శేఖర్ మారం రాజు, వై.వి. చంద్రశేఖర్ రావు తదితరులు పాల్గొని పి.వి.నరసింహారావు చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు.

Related posts