telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో మరో సమస్య..?

తెలంగాణలో మరో కొత్త సమస్య తలెత్తుతుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా రక్తం ఇచ్చేందుకు దాతలు ఎవరూ ముందుకు రావటం లేదు. ఫలితంగా అత్యవసర వైద్య సేవలు నిలిచిపోతున్నాయ్. అవసరమైన దాని కంటే కూడా అతి తక్కువ రక్తం లభించటం ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్తులోనూ ఇలాంటి పరిస్థితులే కొనసాగితే తీవ్ర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా వైద్య రంగం కొవిడ్ కారణంగా కోలుకోలేని దెబ్బతింది. వైరస్‌ భయంతో రక్తదాతలు ముందుకు రావటం లేదు. ఫలితంగా బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు నిండుకున్నాయి. అత్యవసరమైన ఆపరేషన్లు సైతం నెలల తరబడి వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ప్రపంచం వ్యాప్తంగా ప్రతీ రోజూ ఐదు కోట్ల యూనిట్ల రక్తం అవసరం. ప్రస్తుతం ఇందులో సగం కూడా అందుబాటులో లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి 2 సెకన్లకు ఎవరికో ఒకరికి రక్తం అవసరం ఉంటుంది. మామూలు రోజుల్లోనే కావాల్సిన మొత్తంలో రక్తం దొరకడం కష్టం. కరోనా తర్వాత రక్తం కొరత మరింత పెరిగిపోయింది. కరోనా వైరస్ రక్త నిల్వల పాలిట శాపంగా మారింది. కరోనా ఎంట్రీతో లాక్‌డౌన్ విధించారు. ఆ సమయంలో రోడ్డు ప్రమాదాలు అస్సలు జరగలేదు. ఆస్పత్రుల్లోనూ అత్యవసర సర్జరీలు చేశారు. మిగిలిన వాటిని వాయిదా వేశారు. ఇపుడు రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. మరోవైపు గతంలో వాయిదా వేసిన సర్జరీలను ఇపుడు చేస్తున్నారు. దీంతో రక్తం అవసరం అవుతోంది. ఇక ప్రభుత్వ ప్రయివేట్ బ్లడ్ బ్యాంకుల్లో కరోనా నిబంధనలకు లోబడి రక్తం సేకరిస్తున్నారు. కానీ కరోనా పరిస్థితుల్లో రిస్కెందుకు అని చాలా మంది దాతలు రక్తం ఇవ్వడానికి ముందుకు రావటం లేదు.

Related posts