telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

భారత జట్టులో ఆ తేడా ఉండదు : అక్తర్

Shoaib Akthar Pakistan

భారత డ్రెస్సింగ్ రూమ్‌ను‌ పాకిస్థాన్‌ దిగ్గజ పేసర్‌ షోయబ్‌ అక్తర్ కొనియాడాడు. కులం, జాతి, మతం అనే తేడా లేకుండా ఆటగాళ్లకు మద్దతు ఇస్తున్నట్లు భారత్ అద్భుతమని ప్రశంసించాడు. క్లిష్ట సమయంలో బీసీసీఐ, సహచర ఆటగాళ్లు హైదరాబాదీ పేసర్‌ మొహ్మద్ సిరాజ్‌కు మద్దతుగా నిలిచారన్నాడు. తండ్రిని కోల్పోయిన బాధను పంటి బిగువున భరిస్తూ సిరాజ్ బాక్సింగ్ డే టెస్టులో గొప్ప ప్రదర్శన చేశాడని అక్తర్ పేర్కొన్నాడు. ‘మొహ్మద్ సిరాజ్‌కు నా ప్రగాఢ సానుభూతి. క్లిష్ట సమయంలో బీసీసీఐ, సహచర ఆటగాళ్లు అతడికి మద్దతుగా నిలిచారని భావిస్తున్నా. ఎందుకంటే ఆ పరిస్థితులు ఎంతో కఠినంగా ఉంటాయి. కులం, జాతి, మతం అనే తేడా లేకుండా ఆటగాళ్లకు మద్దతు ఇస్తున్న భారత్ అద్భుతం. మైదానంలో జట్లు తయారు చేయబడవు, డ్రెస్సింగ్ రూమ్‌లలో జట్లు తయారు చేయబడతాయి. ఆస్ట్రేలియాపై 36 పరుగులు చేసిన తరువాత భారత్ గొప్పగా పుంజుకుంది. అందులో డ్రెస్సింగ్ రూమ్ పాత్ర కీలకం అని నేను భావిస్తున్నా’ అని అక్తర్ అన్నాడు..

‘భారత్ తరఫున మొహ్మద్ సిరాజ్‌ ఆడుతున్న క్షణాలను అతడి తండ్రి చూడాలని ఎంతో ఆశించాడు. కానీ అది జరగలేదు. అయితే సిరాజ్‌ భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే కాదు, గొప్ప ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. అలాంటి మధుర క్షణాలను అతడి తండ్రి చూడాల్సింది. బాక్సింగ్‌ డే టెస్టులో సిరాజ్‌ ఎంతో భావోద్వేగం చెంది ఉంటాడు. అరంగేట్రంలోనే అతడు అయిదు వికెట్లతో సత్తాచాటాడు. అతడికి ఎంతో ప్రతిభ ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో తన వ్యక్తిత్వాన్ని తెలియజేశాడు’ అని పాకిస్థాన్‌ దిగ్గజ పేసర్‌ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాపై విజయం సాధించడానికి అసలు కారణం భారత బౌలర్ల కృషేనని షోయబ్ అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను ఎలా బోల్తా కొట్టించాలనే కోడ్‌ను టీమిండియా బౌలర్లు ఛేదించారని అన్నాడు. టెస్టు సిరీస్‌ విజయ మార్గంలో భారత్‌ పయనిస్తుందని పేర్కొన్నాడు. తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయంపై మాట్లాడుతూ.. గులాబి బంతిని అంచనా వేయడంలో విఫలమవ్వడమే టీమిండియా ఓటమికి కారణమని అక్తర్‌ అన్నాడు. అజింక్య రహానే తన బ్యాట్‌తో పోరాడాడని, సారథ్యం బాగుందని ప్రశంసించాడు. విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ, మొహ్మద్ షమీ లేకున్నా.. భారత్ అద్భుత విజయాన్ని అందుకుందని చెప్పుకొచ్చాడు.

Related posts