telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మొరాకో రాజధాని రబాట్‌ .. ఇదో పడవల నగరం..

morocco capital rabat is one of best tourist spot

మనసును ఇట్టే ఆకట్టుకునే ఎన్నో ప్రదేశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఈ అందాలు విహారయాత్రలు ఇష్టం ఉన్న వారికి కనపడితే వదులుతారా చెప్పండి. అలాంటి ప్రదేశాలు వాళ్ళకి కనపడటం ఆలస్యం, అక్కడే ఉండాలని అనిపించినన్ని రోజులు ఉంది, వాళ్ళ సరదా తీర్చుకున్నాకే వెనుదిరుగుతారు. మరికొందరైతే ఈ అందాలకు బానిసలై ఆయా ప్రాంతాలలో స్థిర నివాసాలు కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఆ స్థాయికి అస్సలు తగ్గని ఒక ప్రాంతం గురించి చెప్పుకుందాం.. ఇస్లామిక్‌, యూరోపియన్‌, మధ్యయుగ సంస్కృతి, సాంప్రదాయలు, పురాతన నిర్మాణాలతో సందర్శకులను ఆకట్టుకునే ఈ నగరానికి… పర్యాటకులతో పాటు తెల్లని కొంగలూ వలస వస్తుంటాయి. సాగర తీరంలో వందలాది ఆధునిక హంగుల్లో ఉండే పడవలు ఆశ్చర్యపరుస్తాయి. అదే మొరాకో రాజధాని రబాట్‌.

రబాట్‌ భౌగోళిక విస్తీర్ణం 117 చదరపు కిలోమీటర్లు. జనాభా 21,20,192 మంది. జనసాంద్రత ఒక చదరపు కిలోమీటరుకు 4,900. బొరిగ్రేగ్‌ నది అట్లాంటిక్‌ సముద్రంలో కలిసే ముఖద్వారం వద్ద విస్తరించింది రబాట్‌ నగరం. బోరిగ్రే లోయలో చారిత్రక కట్టడాల్లో హస్సన్‌ టవర్‌, పిక్చర్‌ స్క్వేర్‌ చెల్లాహ్ నెక్రోపోలిస్‌లు మధ్యయుగ చరిత్రను తెలుపుతాయి. బొరిగ్రేగ్‌ సాగర తీరంలో 240కి పైగా ఆధునిక పడవలు కనిపిస్తాయి. పశ్చిమ ఆఫ్రికా దేశాలకు వెళ్లే పడవలకు ఇదో స్టేషన్‌గా ఉంటుంది. రబాట్‌లోని విద్యార్థులు అక్కడి భాష సంస్కృతిని నేర్చుకునేందుకు పరిసరాలను పరిశీలించడం ద్వారా అక్కడి స్థానికులతో కలసిపోయి అరబిక్‌ సాంప్రదాయాలు, చరిత్రను తెలుసుకుంటారట. సాంస్కృతిక వారసత్వం, విభిన్న జనాభా, పురాతన కళాఖండాలైన పురావస్తు మ్యూజియం, హస్సన్‌ మసీదు, 5వ మొహమ్మద్‌ సమాధి వంటి నిర్మాణాలు ఇస్లామిక్‌ పూర్వ సంస్కృతిని వివరిస్తాయి. రబాట్‌లో చేతివృత్తులైన కుమ్మరి, నేత, చిత్ర కళానైపుణ్యం అద్భుతంగా ఉంటుంది. రంగురంగులతో అద్దిన సిరామిక్‌ వస్తువులు, బంగారం, వెండి, ఫ్యాబ్రిక్‌, లెదర్‌తో చేసిన వస్తువులు ఆకట్టుకుంటాయి.

రబాట్‌ వీధులను కళానైపుణ్యంతో ఆకట్టుకునేందుకు బహుళ సాంస్కృతులు అంశం ఆధారంగా 22 మంది అంతర్జాతీయ కళాకారులను ఎంపిక చేసి అక్కడున్న ఎత్తైన భవనాలపై, వీధి గోడలపై చిత్రాలు వేయించారు. పది రోజుల వ్యవధిలో వేసిన ఈ అందమైన చిత్రాలు ఈ నగరానికి మరింత అందాన్నిస్తాయి. సంగీతాన్ని ఎంతో ఆరాధిస్తారు రబాట్‌ వాసులు. ‘రిథమ్‌ ఆఫ్‌ వరల్డ్‌’ అనే అర్థం వచ్చే మ్యూజిక్‌ ఫెస్టివల్‌ను ఏటా నిర్వహిస్తున్నారు. దీనిలో స్థానిక, అంతర్జాతీయ కళాకారులు, 25 లక్షల మంది ప్రజలు పాల్గొంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద మినార్‌ హస్సన్‌ టవర్‌. అయితే దీని నిర్మించిన అల్‌-మజుర్‌ మృతి చెందటంతో దీని నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. దీనికి ఎదురుగా ఐదవ మొహమ్మద్‌ సమాధి ఉంటుంది. సున్హ్‌ మసీదు, పీటర్‌ కెథడ్రల్‌ రెండు ఆధ్యాత్మిక మందిరాలు ఉన్నాయి. 2012లో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. రబాట్‌ తీర ప్రాంతంలో సలా కొలోనియాలోని శిథిలాల్లో తెల్లని కొంగలు కనిపిస్తాయి. ఇవి అక్కడికి వలస వస్తుంటాయి. రాయల్‌ ప్యాలెస్‌ దగ్గరలోని బాబ్ రు అనే చరిత్రక నిర్మాణం దాని ఆర్కిటెక్చర్‌, ఆర్ట్‌ గ్యాలరీలోని చిత్రాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. బాబ్ రు ను ‘గేట్‌ ఆఫ్‌ ద విండ్‌’ అని పిలుస్తారు. రబాట్‌ జంతుప్రదర్శనశాలలో అంతరించిపోతున్న బార్బరీ సింహాలను పరిరక్షిస్తున్నారు. ఈ సింహాలు అట్లాస్‌ పర్వతాల్లో ఎక్కువగా నివసిస్తాయి. రబాట్‌ అద్దెకాకుండా ఒక మనిషి జీవించడానికి అయ్యే కనీస ఖర్చు రూ.29,601.

Related posts