telugu navyamedia
సినిమా వార్తలు

బహుముఖాలుగా ఎదిగి ఒదిగిన దర్శకరత్న దాసరి

ఈరోజు నిర్మాత, రచయిత ,దర్శకుడు , నటుడు , పత్రికాధిపతి ,కేంద్ర మాజీ మంత్రి దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి 73వ జయంతి . బహుముఖ ప్రజ్ఞాశాలి , ప్రతిభాశాలి , ప్రయోగశీలి దాసరి నారాయణ రావు .మే 4వ తేదీ అనగానే సినిమా రంగంలో గుర్తుకొచ్చే పేరు దాసరి నారాయణ రావు . ఒక వ్యక్తిగా మొదలైన ఆయన జీవితం వ్యవస్థగా రూపాంతరం చెందటంలో ఆయన పడ్డ కష్టం , ఆయన ఎదుర్కొన్న అవమానాలు ,అవహేళనలు .. ఆయన్ని రాటుతేలేలా చేశాయి. దాసరి నారాయణ రావు లో మొదటి నుంచి నాయకత్వ లక్షణాలు వున్నాయి .

ఆ లక్షణాలు సినిమా రంగానికి ఎంతో మేలు చేశాయి . నేను నా కుటుంబం అని ఆలోచించకుండా .. సినిమా రంగమే నా కుటుంబం అన్న స్థాయికి ఎదిగి ఒదిగిన మహోన్నతుడు దాసరి . అహోరాత్రులు సినిమా రంగం కోసమే కృషి చేశారు . అర్ధరాత్రి ఆయన ఇంటి తలుపు తట్టినా నేనున్నా అనే భరోసా ఇచ్చేవారు . అదీ దాసరి నారాయణ రావు ప్రత్యేకత. .అదే దాసరిని సినిమా రంగంలో ఒక కుటుంబ సభ్యుడు గా మిగిల్చింది .

మే 4 దాసరి నారాయణ రావు జన్మదినోత్సవం . ఆరోజు ఆ ఇల్లు అభిమానులతో , ఆత్మీయులతో , సినిమారంగ ప్రముఖులతో కిక్కిరిసి పోయేది . తనని గ్రీట్ చెయ్యడానికి వచ్చిన వారిని చిరునవ్వుతో పలకరిస్తూ రోజంతా ఎంతో ఉత్సాహంతో ఉండేవారు .ఆయన శ్రీమతి పద్మ కూడా అతిధులను పలకరిస్తూ , మార్యాదలు చేస్తూ ఉండేవారు ఇక మధ్యాహ్నం , రాత్రి ఆయన అందరితో కలసి భోజనం చేసేవారు . అందరినీ తన కుటుంబ సభ్యులుగా భావించేవారు .

.మనం ఎవరైనా చనిపోయినప్పుడు .. “ఆయన లేని లోటు ఎవరూ భర్తీ చెయ్యలేరు …” అని వాడుతూ ఉంటాం . కానీ దాసరి నారాయణ రావు గారు చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది … ఇప్పుడు సినిమా రంగానికి దాసరి లేని లోటు నిజాంగానే గుర్తుకొస్తుంది .

సినిమా వారందరూ ఆయన్ని ఆప్యాయంగా మేస్త్రి అని పిలుచుకునేవారు .. దాసరి తన సినిమాల ద్వారా ఎప్పుడూ గుర్తున్నా ఆయన లేని లోటు మాత్రం అలాగే వుంది . దాన్ని ఎవరూ భర్తీ చెయ్యలేరు . దాసరి నారాయణ రావు మే 4 1947 పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు . 30 మే 2017న .. భౌతికంగా మనకు దూరమయ్యారు తెలుగు సినిమా రంగంలో ఆయన స్మృతి .. చిరస్మరణీయంగా ఉంటుంది .
-భగీరథ

Related posts