telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఒకే రోజు వస్తున్న బాలయ్య, రవితేజ

బాలకృష్ణ, బోయపాటి కాంబో అంటేనే తెలుగు ఇండస్ట్రీలో సంచలనాల కాంబోగా పేరు తెచ్చుకుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు కూడా రికార్డులు సృష్టించాయి. ప్రస్తుతం వీరి కాంబోలో మూడో సినిమా రానుండటంతో ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మిరియాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. బాలకృష్ణతో తలపడేందుకు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి సిద్దమవుతున్నాడు. అయితే.. ఇప్పటి వరకూ బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణపై రవితేజదే పై చేయిగా ఉంటూ వచ్చింది‌. రవితేజ స్టార్ అయిన తర్వాత మూడుసార్లు వీరిద్దరి సినిమాలు ఒకే స‌మ‌యంలో రిలీజయ్యాయి. ముందుగా 2008 సంక్రాంతికి బాల‌య్య సినిమా ఒక్క మ‌గాడు, ర‌వితేజ చిత్రం కృష్ణ పోటీ ప‌డ్డాయి. జనవరి 10న బాలకృష్ణ చిత్రం, 11న రవితేజ చిత్రం విడుదలయ్యాయి. అయితే రవితేజ కృష్ణ విన్నర్ గా నిలిచింది. ఇక ఆ మరుచటి సంవత్సరం అనగా 2009 మే 1న బాల‌య్య సినిమా ‘మిత్రుడు’ రిలీజ్ అయి ఫ్లాప్ కాగా ఆ తర్వాత వారంలో మే 8న విడుదలైన ర‌వితేజ సినిమా కిక్ బంపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత రెండేశ్ళకు సంక్రాంతికి మరోసారి పోటీ ప‌డ్డారు బాల‌య్య‌, ర‌వితేజ‌. ఈసారి కూడా ఫ‌లితంలో తేడా లేదు. 2011 జనవరి 12 విడుదలైన బాల‌య్య ‘ప‌ర‌మ‌వీర‌చక్ర’ ఆయ‌న కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది. అదే తేదీన రిలీజ్ అయిన మాస్ రాజా ‘మిర‌పకాయ్’ హిట్ కొట్టింది. ఇప్పుడు ఈ ఏడాది మే 28న మరోసారి బాక్సాఫీస్ పోరుకు రెడీ అవుతున్నారు బాలకృష్ణ, రవితేజ. బాలకృష్ణ, బోయపాటి కలయికలో వస్తున్న బిబి3ని ఎన్టీఆర్ జయంతి కానుకగా మే 28న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖిలాడీ’ ని కూడా అదే రోజు విడుదలకు ప్లాన్ చేశారు. ఇప్పటి వరకూ తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎన్టీఆర్ జయంతికి విడుదలైన ఏ ఇతర హీరో చిత్రం విజయం సాధించిన దాఖలాలు లేవు. అదీ కాకుండా బిబి3 ట్రైలర్ తో అంచనాలు అంబరాన్ని అంటి ఉండటం, బాలకృష్ణ, బోయపాటి కలయికకు పరాజయం లేక పోవడంతో బాలయ్య హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. మరి బాలకృష్ణతో పోటీకి రవితేజ సై అంటాడా? లేక సైడ్ ఇచ్చి తొలగి పోతాడా? అన్నది చూడాలి. ఒక వేళ పోటీ పడితే ఈ సారైనా బాలయ్య తనదే పై చేయి అనిపించుకుంటాడేమో చూద్దాం.

Related posts